ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దు!
09.07.2025 బుధవారం 3524* వ రోజు నాటి శ్రమ జీవన సిత్రాలు!
216 జాతీయ రహదారి పైనే గత నెలరోజులు పైగా జరుగుతున్నటు వంటి స్వచ్చ సేవలకు కొనసాగింపుగా ఈరోజు తెల్లవారుజామున 4:13 నిమిషాలకు 17 మంది కార్యకర్తలు క్లబ్ రోడ్ కు అతి సమీపంలో పనికి సిద్దమయ్యారు. గత సంవత్సరకాలం క్రితం మొక్కలు నాటిన దగ్గర నుండి మధ్యలో ఒకటి రెండు సార్లు ట్రస్టు కార్మికులు ఆ ప్రాంతంలో పని చేశారు. దాని వలన గడ్డి, పొదలు, జిల్లేడు చెట్లు దట్టంగా పెరిగి కార్యకర్తలకు ఊపిరి సలపనంతగా కావలసినంత పని అక్కడ సిద్దంగా ఉంది.
ఆ పనిని చేసి ఆ ప్రాంతమంతా సుందరంగా చేయటానికి మనవాళ్ళకు కావలసిన పనిముట్లు పదునైన కత్తులు, గొర్రులు, పలుగులు, చేతి దంతులు కోత కొడవళ్ళు తీసుకుని ఎవరికి వారు చొరబడ్డారు. మహిళా కార్యకర్తలు సైతం ఈరోజు ఎక్కువమంది చీపుళ్లు ప్రక్కనెట్టి కొడవళ్ళను చేతబట్టి కలుపుగడ్డిని కోసి గుట్టలుగా పెట్టారు.
పై భాగంలో గడ్డి కోత యంత్రంతో ఎంతో అందంగా కత్తిరిస్తుండగా, పూల మొక్కల రక్షణకు చుట్టూ కంప కట్టిన పాదుల మధ్యలో మొలిచిన కలుపు లాగటానికి ఇది వరకు సినిమా టికెట్ కౌంటర్ రంద్రంలో టికెట్ కోసం చెయ్యి పెట్టినట్లుగా ముళ్ల మధ్యన ఎంతో చాకచక్యంగా ఆ కలుపును తీయడం వారి పనితనానికి నిదర్శనం.
మరికొంత మంది క్రింది భాగంలోని ప్రతి మొక్కకూ వేర్లు బయట పడకుండా మొక్క వంగకుండా బలంగా మట్టి పోసి కర్ర కట్టడం. ఇవన్నీ చూస్తుంటే “సొంత లాభం కొంత మాని పొరుగు వారికి తోడు పడవోయ్” అన్న గురజాడ పద్యం గుర్తుకు వస్తుంది.
నేటి చల్లపల్లి సంతరించుకున్న పెనుమార్పులో, అందచందాల పూదోటల కూర్పులో, అభివృద్ధిలో, ముందడుగులో, చల్లపల్లి ఘన కీర్తిలో స్వచ్చ కార్యకర్త పాత్ర అసామాన్యం, అనిర్వచనీయం,
మేఘాలు కమ్మి వాన కురవని చల్లదనంలో మా పనికి ఇది అనువైన వాతావరణం అనుకుంటూ ఉత్సాహంతో వంచిన నడుములెత్తకుండా ఈ ఊరి కొరకు శ్రమిస్తున్న కార్యకర్తలు 6 గంటల వరకూ శ్రమించి విజిల్ మ్రోగిన తరువాత పనికి విరామమిచ్చి,
రేపు చేయవలసిన పనీపాటలు చర్చించుకుంటూ కాఫీ సేవించారు. తదుపరి సమీక్షలో రాజు గారు సావధానంగా పలికిన “జై స్వచ్చ సుందర చల్లపల్లి” కి కొట్టి రేపు కలవవలసిన ప్రదేశం కూడా ఈరోజు పని ఆపిన చోటే అని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
09.07.2025
అత్యాశాపరులు సుమా
నిత్య శ్రమ నీరాజనమర్పిస్తూ తమ ఊరిని
ఉద్ధరించి తీరాలని ఉవ్విళ్ళూరుచు తెగబడి
పెనగులాడు స్పచ్ఛ ధర్మ వీరుల కృషి గమనిస్తూ
“అత్యాశాపరులు సుమా!” అన వచ్చా ఇక వీరిని?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
09.07.2025