3526* వ రోజు . ....           11-Jul-2025

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

11.07.2025 శుక్రవారం 3526* వ రోజు నాటి స్వచ్చ సేవా సన్నివేశములు!

          వేకువ జామున 4:17 నిమిషాలకే 9 మంది కార్యకర్తలు హైవే రోడ్డు వద్ద (క్లబ్ రోడ్ కు అతి సమీపంలో) సేవలకు ఉపక్రమించారు. రహదారి క్రింది భాగంలో పెద్ద మొక్కల చుట్టూ మరియు వేరు వేరు రకాలైన నానాజాతి లాంటి గడ్డి దట్టంగా పెరిగి, చూడడానికి అందవికారంగా ఉన్న గడ్డిని మొత్తం కొంతమంది కార్యకర్తలు మరియు గడ్డి కోయు యంత్రంతో ఒక కార్యకర్త శుభ్రపరిచారు. మరికొంత మంది గొర్రులతో ఎండిపోయిన ముళ్ళ కంపలను లాగి పనికి అడ్డం లేకుండా చేశారు.

         ఏది ఏమైతేనే  గత సంవత్సరం ఆగష్టులో గుంటూరు మెడికల్ కాలేజిలో చదివిన 1974  బ్యాచ్ కు చెందిన వైద్యులు నాటిన మొక్కలు మాత్రం ఎంతో ఆకర్షణీయంగా ఇప్పుడు కనిపిస్తున్నాయి.

         ముగ్గురు లేదా నలుగురు పని మినహా జాతీయ రహదారికి ఒక ప్రక్క కాసానగర్ జంక్షన్ నుండి క్లబ్ రోడ్ వరకు క్లీన్ ఆపరేషన్ పూర్తికావచ్చింది.

         మరికొద్దిమంది కార్యకర్తలు పెద్ద, చిన్న మొక్కలకు పాదులు చేసుకుంటూ మొదళ్ళకు మట్టిని బలం చేస్తూ వస్తున్నారు. రోడ్డు దిగువ భాగాన ఉన్న మరికొన్ని మొక్కలకు పాదులు చేసి మట్టి బలంగా వేయవలసిన పని కొంత మిగిలి ఉంది.

         జాతీయ రహదారి మీదుగా రయ్ రయ్ మంటూ దూసుకొచ్చే వాహనాలను జాగ్రత్తగా చూసుకుని తప్పుకుంటూ, పర్వత శిఖరాల్లాంటి ఎత్తు నుండి రోడ్డు పల్లానికి జాగ్రత్తగా దిగి పని చేస్తూ గ్రామ స్వచ్చత కోసం వారి లక్ష్యం నేరవేరే వరకూ వారు చేస్తున్నది నిజంగా స్వచ్చ యజ్ఞమే.

         హైవే రోడ్డుకు రెండో ప్రక్కన ఉన్న చెత్తాచెదారాలను తొలగించే పని ఎప్పుడు మొదలు పెట్టాలా అంటూ విరామ మెరుగక కష్టించే కార్యకర్తలు 6 గంటల వరకూ పని చేసి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి చేతులు శుభ్రపరచుకుని కాఫీ సేవిస్తూ పనిపాటల ముచ్చట్లతో పాటు, కొద్ది రోజుల క్రితం కార్యకర్తలతో కలిసి అధికారులు నాటిన “మామిడి మొక్కల అదృశ్యం” పై కొంత కలవరపాటుకు గురై నెమ్మదిగా సమీక్షా సమావేశానికి నడిచారు.

         సమీక్షలో భరత్ గారు చెప్పిన్ “జై స్వచ్చ సుందర చల్లపల్లి” కి సాధిస్తాం అంటూ మద్ధతు పలకగా ఈరోజు కొత్తగా స్వచ్చ సేవకు మోపిదేవి మండల విద్యుత్ శాఖ అధికారి వారి కుమారుడు జీవన్ వచ్చిన సందర్భాన్ని పరిచయం చేసుకుని,

         రేపు మనం కలవవలసిన ప్రదేశం బైపాస్ రోడ్డులోని తాత గారి ఇంటి వద్ద అనుకుని నిష్క్రమించుట జరిగినది.

- నందేటి శ్రీనివాస్

   ప్రజా కళాకారుడు  

  11.07.2025

 

         చరిత్ర చెపుతోంది మనకు!

పాతిక ముప్పై మందే పట్టుదలతొ పనిచేస్తే –

ప్రణాళికాబద్ధంగా శ్రమ చేసుకుపోతుంటే –

ఊరు స్పచ్ఛ – శుభ్రంగా మారి తీరునను సత్యం

చల్లపల్లి శ్రమదానపు చరిత్ర చెపుతోంది మనకు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

    11.07.2025