పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
13.07.2025 ఆదివారం 3528* వ రోజు నాటి శ్రమదాన వివరములు!
హైవే రోడ్ లోని క్లబ్ రోడ్ కు దగ్గరలో 4.18 ని. వేకువ జామున13 మంది కార్యకర్తలు మొన్న చేయగా మిగిలిన భాగమును అనగా కలుపు గడ్డిని, దట్టంగా కమ్ముకున్న పిచ్చి కాడను, పురుడు కంపను కొట్టి ఆ ప్రాంతాన్ని పూర్తి చేయడం జరిగింది.
పని చేయగా వచ్చిన తుక్కును వేరు వేరు చోట్ల కోతకు గురై మట్టి కొట్టుకు పోకుండా ఆ గాడిలో వేసి సర్దినారు. ఒక కార్యకర్త మిషన్ తో అక్కడక్కడా మిగిలిన భాగాన్ని కత్తిరిస్తుండగా, కొద్దిమంది కార్యకర్తలు వరుస క్రమంలో పోయిన మొక్కలను నాటుతూ వాటికి పాదులు చేస్తున్నారు.
ఉక్కపోతను లెక్కచేయక కార్యకర్తలు శ్రమించి ఆ భాగాన్ని పూర్తి చేసి అవతల వైపు (హైవే కు రెండవ వైపు) పనికి బోణీ కొట్టారు. బాల కార్యకర్తలతో సహా41 మంది కార్యకర్తలు “ ఆడుతు పాడుతు పని చేస్తుంటే- అలుపూ సొలుపేమున్నది” అన్న చందాన హుషారుగా పనిని పూర్తి చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
6 గంటల వరకు విసుగు చెందని విక్రమార్కుల వలె చెమటను చిందించిన సైనికులు విజిల్ మ్రోగిన సమయానికి పనికి విరామమిచ్చి, కాఫీ కబుర్ల అనంతరం దుక్కి దున్ని దమ్ముకు సిద్దం చేస్తున్న మాగాణి భూమిలో ఈ రోజు సమీక్ష సమావేశానికి ముందుకు నడిచారు. ఈ రోజు స్వచ్చ సేవకు విచ్చేసిన వేంకటేశ్వర టెక్స్ టైల్స్ అధినేత శ్రీ రామ్ కుమార్ గారిని అభినందించారు.
వారి పిల్లలతో సహా ఈ రోజు స్వచ్చ సేవలో పాల్గొన్న దాసరి స్నేహ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి అందరూ జై కొట్టగా, నేను ఇంకా గట్టిగా జై కొడతానంటూ వారి మేనల్లుడు ‘ఆరవ్’ ఆరున్నర శ్రుతిలో పలికిన “జై స్వచ్చ సుందర చల్లపల్లి” నినాదానికి మరొక్కసారి కార్యకర్తలు స్వచ్చ స్ఫూర్తితో జై కొట్టినారు.
డాక్టరు గారు మాట్లాడుతూ గ్రూపులో పెట్టిన “వృక్ష విలాపం” ఆర్టికల్ ను అందరూ ఒకసారి చూడండి అని చెప్పి, మన కార్యకర్త గోళ్ళ సాంబశివ రావు గారి అబ్బాయి ఆరోగ్య పరిస్థితి వివరించి వీలును బట్టి ఒకసారి చూసివద్దామని గుర్తు చేసి, రేపు కలవవలసిన ప్రదేశం ఈరోజు పని ఆపిన చోటునే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
13.07.2025.
హరిత శోభ
పిచ్చి మొక్క, ముళ్ళ కంప, వీధి గుంట, మురుగు కాల్వ
చెత్తలు – దుమ్ములు – ప్లాస్టిక్ సీసాలూ, ఎంగిలాకు –
ఏవైనా కార్యకర్త ఏరివేత కనర్హమూ?
వీధుల్లో పుష్ప హరిత శోభ అతని ధ్యేయమా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
13.07.2025