ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!
14.07.2025 సోమవారం 3529* నాటి స్వచ్చ సేవా యజ్ఞం పద ఘట్టములు !
216 జాతీయరహదారి క్లబ్ రోడ్ కు మొదట్లో, కోమలానగర్ వద్ద తెల్లవారుజాము 6+5=11 మంది కార్యకర్తలు వారివారి పనిముట్లు చేబూని శ్రమ యుద్ధం మొదలుపెట్టారు. రోడ్డు మార్జిన్ లోని గడ్డి, పిచ్చి మొక్కలను ఒక కార్యకర్త మిషన్ తో కత్తిరిస్తూ తన పని తాను తదేక దీక్షతో చేస్తుండగా రోడ్డుకు క్రింది భాగంలోనూ, మొక్కల పాదుల మధ్యలోను మొలచిన పిచ్చి మొక్కలు, గడ్డి, పిచ్చి తీగ లాంటి మంచి మొక్కలు ఎదుగుదలకు అవరోధంగా ఉండే గడ్డిని కొంతమంది కార్యకర్తలు పదునైన కత్తితో బాగుచేశారు.
11 మంది కార్యకర్తలు ఈరోజు కోమలానగర్ లోని ఒక రోడ్డులో కార్యక్రమం నిమిత్తం అత్యవసరంగా చేయవలసిన పనిని పురమాయించుకుని ఆ పని పూర్తి చేశారు.
హైవే రోడ్డు లో కాసానగర్ జంక్షన్ నుండి క్లబ్ రోడ్ వరకు ఇప్పటిదాకా ఒక ప్రక్కపూర్తి కాగా ఆ పనికి అనేక మంది కార్యకర్తలు నెల రోజులపైగా వారి సమయాన్ని శ్రమను త్యాగం చేశారు. చూసినకొద్దీ చూడాలనిపిస్తున్న హైవే ప్రక్కన పూల మొక్కలు, నీడనిచ్చు మొక్కలు, ప్రవేశ ద్వార ప్రాంతము మనమున్నది చల్లపల్లి ప్రాంతమేనా అనిపిస్తున్నది. మరొక సంవత్సరం తరువాత హైవే పై చల్లపల్లి ప్రాంతాన్ని కలుపుకుపోయే 3 కిలోమీటర్ల ప్రాంతం పర్యాటకులతో క్రిక్కిరిసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
శ్రమ ద్వారా వచ్చిన ఫలితాలు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటాయనటానికి చల్లపల్లిలోని కార్యకర్తల శ్రమ ద్వారా సృష్టించబడిన వేలాది మొక్కలు రహదారి వనాలు, శ్మశాన ప్రాంగణాలు, పబ్లిక్ టాయిలెట్లు లాంటి అనేకమైన మౌలిక వనరులు ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లిలో శ్రమకు సజీవ సాక్ష్యాలు.
ఈరోజు కొంచెం ఉక్కపోతగా ఉన్నా చేతిలోని కత్తులకు కంకర రాళ్ళు తగిలి నిప్పు రవ్వలు వచ్చి పనిని కొంచెం ఆటంకపరుస్తున్నా స్వచ్చ సైనికుని లక్ష్యం ముందు ఆటంకాలెంత అన్నట్లు 6 గంటల వరకు పని చేసి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప మొత్తం 32 మందిలో 21 మంది సమీక్షా సమావేశంలో పాల్గొని సజ్జా ప్రసాదు గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రదేశం ఈ ప్రాంతములోని ఈరోజు పని ఆగిన చోటు అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
14.07.2025.
కొందరు తొలి అడుగేస్తే
స్పచ్ఛ శుభ్ర పరిసరాలె పరమాత్ముని సన్నిధులని
Cleanliness is next to godlyness
సౌందర్య విరాజితాలె స్వర్గ లోక పెన్నిధులని
అంటాం – మరి దేవళాల ఆవరణల శుభ్రతేది?
కోట్ల మంది స్నానించే కుంభ మేళ మాటేమిటి?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
14.07.2025