3531* వ రోజు . ....           16-Jul-2025

 ఒకసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులు వాడకం వ్యర్ధం

పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మన జీవితానికి అర్ధం!

16.07.2025 బుధవారం 3531* వ రోజు నాటి మన ఊరి స్వచ్చోద్యమ ఘట్టాలు!

         దాదాపు 2 నెలలుగా జాతీయ రహదారి వెంబడి జరుగుతున్న స్వచ్ఛ శుభ్ర సౌందర్య క్రియలకు కొనసాగింపుగా ఈరోజు వేకువ జాము 4:17 నిమిషాలకు 13 మంది కార్యకర్తలు హైవేపై నిన్న పని ముగించిన చోటున పని ప్రారంభించారు.

         భావి తరాల వారికి మంచి పర్యావరణాన్ని తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించే లక్ష్యంతో పని చేస్తున్న వీరు  హైవే రోడ్డుకు రెండవ వైపు నాటిన గద్ద గోరు మొక్కలు, నీడనిచ్చు తురాయి మొక్కల పెరుగుదలకు ఆటంకంగా ఉన్న కలుపు మొక్కలు పిచ్చి తీగలు లేకుండా చెయ్యడమే వీరి టార్గెట్.

         మొక్కల మొదళ్ళకు మట్టి పోయడం, సరిచేయడం కొందరు కార్యకర్తల పనిగా జరుగుతూ ఉంటే కొందరు కార్యకర్తలు మాత్రం హైవే మీద వంతెనపై ఇంత అపరిశుభ్రంగా ఎందుకుండాలి? అనుకుని దానిపై ఉన్న మట్టిని వర్షపు నీరు పోయే రంద్రాలు పూడి పోవడం వలన దానిలో మట్టి తుక్కును తీసివేసి ఎంతో పరిశుభ్రంగా తయారుచేశారు.

         మందుబాబులకు పునరావాస కేంద్రంగా ఉన్న ఆ వంతెనపై వారు చేసే వికృత చేష్టలకు పరాకాష్టగా తాగిన సీసాలు, గ్లాసులు పగలగొట్టిన గాజు పెంకులు తిని పారేసిన పలావు పొట్లల కవర్లు, వీటన్నింటిని ఈ సమాజంలో అందరి కోసం పని చేస్తున్న వివిధ స్థాయిలలో ఉన్న కల్మషం ఎరుగని స్వచ్ఛ కార్యకర్తలు మాత్రమే వాటిని వారి చేతులతో తీసి, చేరవలసిన చోటికి చేర్చేది. ఇంక ఎవరికీ ఈ పనులు పట్టవు.

         ఊరి జనం చేస్తున్న ఈ కల్మషాన్ని, ఈ దుర్గంధభరిత వ్యర్ధాలను ఇంత ఊరిలో అతి కొద్దిమంది సైనికులు, అందునా వేరువేరు వృత్తులలో ఉన్న మహిళా కార్యకర్తలు శుభ్రం చేస్తుంటే నిజంగా గుండె బరువెక్కుతుంది. దశాబ్దకాలంగా వారు శ్రమతో చేస్తున్న అద్భుతమైన మార్పులను మిగతాజనంలో కొంతమంది ఆహ్వానించకపోవడం భావ్యమా!

         10 సంవత్సరాలకు పూర్వం ఈ స్వచ్ఛ ఉద్యమం మొదలు కాక ముందు ఇళ్లలోని చెత్తా చెదారాలు, వంటింటి వ్యర్ధాలను ఇంటి వాకిట్లో నుండి ప్రహరీ మీదుగా రోడ్ల మీదకు వేసిన జనం ఈరోజు తడి, పొడి చెత్త డబ్బాలను వేరువేరుగా వేసి ఇంటి బయట రోడ్ల మీదకు వచ్చి చెత్త బండి కోసం ఎదురు చూస్తూ నిలబడుతున్న ఈ చారిత్రక మార్పు స్వచ్ఛ కార్యకర్తల కష్టంతో జరుగుతున్న స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ ఫలం కాదా? ఆలోచించండి.

         ఏది ఏమైనా ఈ చల్లపల్లి శుభ్రతా స్వచ్ఛత సుందరీకరణే ఈ కార్యకర్తల లక్ష్యం, గమ్యం. ఆ స్ఫూర్తితోనే ఈరోజు 32 మంది కార్యకర్తలు 6 గంటల వరకూ పనిచేసి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీకి వస్తూ ఒకసారి చేసిన పనిని వెనుదిరిగి చూసుకుని దానిలో ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేకున్నా వారు పొందే సంతోషం మాటలలో చెప్పలేనిది.

         కాఫీ ముచ్చట్ల తదుపరి సమీక్షలో కాలుకి దెబ్బ తగలడం వలన కొంత కాలం విరామం తరువాత ఈరోజు వచ్చిన తాతినేని రమణగారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లినినాదానికి గొంతు కలిపి జై కొట్టి,

         రేపు కలువవలసిన ప్రదేశం హైవేలోని కోత మిషన్ బాట వద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు

  16.07.2025.

 

చల్లపల్లిలో వృక్ష విలాపం 2

(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)

నరుల పుట్టుక కన్న ముందే పుట్టిపెరిగిన వృక్షజాతిమి

 వానరులుగా మనుషులుండగ వాస యోగ్యములైనవారము

 బ్రతుకులో అడుగడుగునా మీ అవసరాలను తీర్చినారము

జీవ జాతుల మనుగడకు మా ప్రాణవాయువెగదా మూలము ?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   16.07.2025