ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!
17.07.2025 గురువారం 3532* వ రోజు నాటి స్వచ్ఛ సేవా విశేషాలు!
హైవేపై బండ్రేవు కోడు వంతెనకు అతి సమీపంలో 17 మంది కార్యకర్తలు 4:19 నిమిషాలకు పనిని ప్రారంభించారు. నిన్న కొద్దిపాటి వర్షం పడడంతో వాతావరణం కొంచెం అనుకూలంగా ఉండడం, కార్యకర్తలు రోడ్డు దిగువున పని చేయుటవలన ఏటవాలుగా ఉండి నిలబడి పనిచేయడం కష్టంగా అనిపించింది. అయినా నిరుత్సాహపడకుండా ఆ ప్రాంతమంతా సుందరంగా ఒక క్రమపద్ధతిలో తీర్చిదిద్దారు. వంతెన దాటిన తరువాత అక్కడ సువర్ణ గన్నేరు పసుపు పూల తోట ఉండడంతో దాని పొడవునా కలుపు తక్కువగా ఉంది.
కానీ ఎత్తుగా పెరిగిన పిచ్చి మొక్కలను ముగ్గురు లాగివేయడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు అవతలి వైపు పెద్ద మొక్కలను సరిచేసే పనిలో రోజూ మాదిరిగానే వాటి మొదళ్లకు మట్టిని బలం చేస్తూ సరిచేసి కట్టడం జరిగింది.
కొద్దిమంది మహిళా కార్యకర్తలు మాత్రం వర్షానికి తడిసి మెత్తగా వస్తున్న చిన్నపాటి కలుపు మొక్కలను వరుసగా పెట్టి పంట చేలో పనిచేస్తున్న చందాన చేతితో లాగివేశారు.
వంతెన శుభ్రం చేస్తున్న కార్యకర్తలు వంతెన భాగంలో ఎక్కడా కాగితం ముక్కా, దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రం చేసి హైవేను ప్రభుత్వం జాతికి అంకితమిచ్చినట్లు శుభ్రం చేసిన వంతెన భాగాన్ని వాడుకోమని చల్లపల్లికి అప్పజెప్పినారు.
6 గంటల వరకూ అవిశ్రాంతంగా పనిచేసిన 31 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగే సరికి పనికి విరామమిచ్చి పనిముట్లు సర్దుకుని కాఫీ కబుర్లాడుకొని అడపా గురవయ్య మాస్టారు చెప్పిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదాలకు జై కొట్టి వారు చెప్పిన నీతి సూక్తులు విని,
రేపు మనం కలువవలసిన ప్రదేశం కూడా ఈ బండ్రేవు కోడు వంతెన పైనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాసరావు
ప్రజా కళాకారుడు
17.07.2025.
చల్లపల్లిలో వృక్ష విలాపం – 3
(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)
చెడ్డ వాయువు పీల్చివేస్తూ దొడ్డ వాయువునిచ్చుచుందుము
సైన్సు తెలుసా - చరిత తెలుసా ? శాస్త్రవేత్తల నడిగిచూడుము
చెట్లపై పాటలు రచించే శ్రేష్ఠకవి “జయరాజు” నడుగుము
వృక్ష సంతతి లేని బ్రతుకును ఒక్కపరి ఊహించిచూడుము.
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
17.07.2025