ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!
18.07.2025 శుక్రవారం 3533* వ రోజు నాటి శ్రమ యాగపు సరిగమలు!
జాతీయ రహదారిపై బండ్రేవు కోడు వంతెన వద్ద తెల్లవారుజాము 4.17 ని.లకు 10 మంది కార్యకర్తలతో ఈ రోజు పని ప్రారంభించినారు.
వంతెనకు అవతల భాగాన ఉన్న సువర్ణ గన్నేరు పూదోట వైపు ఉన్న కలుపును ఏరివేయగా కొంతమంది రోడ్డుకు దిగువ భాగాన ఉన్న కలుపు గడ్డిని కత్తులతో శుభ్రం చేయడం జరిగింది.
ఒక కార్యకర్త గడ్డి కోత యంత్రంతో కొంత భాగం గడ్డిని కట్ చేయడం జరిగింది.
కొద్ది మంది కార్యకర్తలు రోజూ లాగానే మొక్కలకు మట్టి పోసే పనిని కొనసాగిస్తూ వాటికి శాశ్వత ప్రాతిపదికన సంరక్షణా చర్యలు చేపడుతున్నారు.
రాత్రి వాతావరణం వర్షం పడి అనుకూలంగా లేనప్పటికీ స్వచ్చ కార్యకర్తలు మాత్రం “ కష్టాలున్నాయన్న సాకుతో మన ముందున్న కర్తవ్యాలు బాధ్యతలు మరువరాదు” అన్న సుందరయ్య గారి సూక్తిని ప్రేరణగా స్వచ్చ సుందర చల్లపల్లి సాధనే మా కర్తవ్యం, అందుకు రోజువారి తాము చేస్తున్నది మా బాధ్యతగా అనుకుంటూ యథా ప్రకారం స్వచ్చ శ్రమ మొదలుపెట్టారు.
కానీ కొద్ది సమయం పని జరిగిన తరువాత 5.20 గం.లకు కుంభ వర్షం కుమ్మరించగా అందరూ తడిసి ముద్దవటం కొంత సమయం స్వచ్చ రథాలైన వాహనాల మాటున దాగినా, వర్షం వదలి పెట్టకపోయేసరికి పని ముగించి వెను తిరిగారు.
వర్షంలోనే తడుస్తూ ఆసుపత్రి వద్ద ఉన్న పద్మాభిరామం ప్రాంగణంకు చేరుకోగా తడిసి చలితో వణుకుతున్న కార్యకర్తలకు వేడి వేడి కాఫీ కొంత ఉపశమనం కలిగించింది.
తదుపరి సమీక్షలో కస్తూరి శ్రీనివాస్ పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లికి జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రదేశం బండ్రేవు కోడు వంతెన వద్ద అనుకుని ఇంటి ముఖం పట్టారు.
పుడమి యంత శ్రమ యాగపు వేదికరా నిజానికి
పని పాటల సోదరులే పునాదులీ భువనానికి
- నందేటి శ్రీనివాసరావు
ప్రజా కళాకారుడు
18.07.2025.
చల్లపల్లిలో వృక్ష విలాపం – 4
(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)
మీకు కన్నుల విందు చేసే - సువాసన వెదజల్లు చుండే
ప్రశాంతతలకు దారి చూపే రంగురంగుల పూల గుత్తులు
దారి ప్రక్కన పూలు కొందరు తస్కరించుట ఎంత హేయము?
పూల మొక్కలు దొంగిలించుట పుణ్యకార్యమ - పాపకార్యమ?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
18.07.2025