3535* వ రోజు .....           20-Jul-2025

 ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!

20.07.2025 - 3535* వ రోజు నాటి స్వచ్ఛ సేవా యజ్ఞం ! 

         వేకువ జామున 4.21 నిమిషాలకు 13 మంది స్వచ్ఛ కార్యకర్తలు 216 జాతీయ రహదారి పైన గంగులవారి పాలెం రోడ్డు స్వాగత ద్వారానికి సమీపంలో పని మొదలు పెట్టారు . నిన్న జరిగిన పనికి కొనసాగింపుగా సువర్ణ గన్నేరు మొక్కల క్రింది భాగంలో ఉన్న కలుపు,పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించినారు. అలాగే ఒక కార్యకర్త పై భాగంలోని రోడ్డు మార్జిన్ పొడవునా గడ్డి కోత మిషన్ తో ఆ ప్రాంగణంలో అందంగా కత్తిరించడం జరిగినది.

         అరడజను మందికి పైగా మహిళా కార్యకర్తలు రోడ్డు మార్జిన్ పొడవునా చీపుళ్లు పట్టి మిషన్ తో కత్తిరించిన చెత్తను ఊడ్చివేయగా ఆ ప్రాంతమంతా అత్యంత సుందరంగా తయారైంది.

         మరికొంతమంది కార్యకర్తలు నీడనిచ్చు పెద్ద మొక్కలకు సంరక్షణగా మట్టి పోయడం, కంప కటడం, మొక్కను నిలబెట్టి కట్టడం లాంటివి  కొద్ది రోజులుగా చేస్తున్న పనిని ఈ రోజు కూడా కొనసాగించారు.

         ఆదివారం కావడంతో అందరూ కూడా సమయంతో పని లేకుండా చేసిన నంత సేపు ఎంతో ఉత్సాహంగా పనిచేశారు.

         6 గంటలు దాటిన తరువాత విజిల్ మ్రోగగానే 36 కార్యకర్తలు పనికి విరామమిచ్చి పనిముట్లను చేతబట్టి స్వాగత ద్వారం వద్ద కాఫీ సేవించిన పిదప సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. స్వచ్చ చల్లపల్లి గాయకుడు నందేటి శ్రీనివాసుడు పలికిన “జై స్వచ్చ సుందర చల్లపల్లి” నినాదంతో గొంతు కలిపి శ్రీనివాస్ స్వచ్చ కార్యకర్తల కష్టాన్ని వివరిస్తూ ఆలపించిన పద్యానికి ఈలలు వేసి ప్రోత్సహించారు.  

         ఈ రోజు స్వచ్చ సేవలో పాల్గొన్న డా. డి. ఆర్. కె. గారి మిత్రులు బాపట్ల కు చెందిన డా. బోసు గారు మాట్లాడుతూ 3535* రోజులుగా మీరు పలు విధాలుగా గ్రామానికి చేస్తున్న ఈ స్వచ్చంద సేవలను మాటలతో అభినందించడం సరైన పద్ధతి అనిపించడం లేదు. కాబట్టి నా ఆలోచనలకు అనుగుణంగా మీ నుంచి మరింత స్ఫూర్తి పొంది నేను కూడా ఎంతో కొంత ఈ సమాజానికి సేవ చేయగలనన్న నమ్మకం కలిగింది అన్నారు.

         డా. డి.ఆర్. కె గారు మాట్లాడుతూ బోసు గారిని సభా ముఖంగా పరిచయం చేసి శ్రమ ద్వారా మాత్రమే అద్భుతమైన ఫలితాలు సాధించగలమని ఇప్పటి వరకు జరిగిన పనిని చూస్తే అర్థమవుతుందని అన్నారు.

         రేపు కలవవలసిన ప్రదేశం ఈ స్వాగత ద్వారం” వద్దనే  అని సమీక్ష ముగించారు.  

 

- నందేటి శ్రీనివాసరావు

  ప్రజా కళాకారుడు

  20.07.2025.

చల్లపల్లిలో వృక్ష విలాపం – 6

(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)

కాయగూరలు కోయవచ్చును - కలపకోసం నరకవచ్చును

వంట చెరుకుగ తప్పనప్పుడు వాడవచ్చును అప్పుడప్పుడు

కాని- పూజకు పూలు కోసే, అకారణంగా చెట్లు నరికే

ఘాతుకాలను ఆపకుంటే కర్మఫలితం తప్పదెపుడు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   20.07.2025