ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!
21.07.2025 సోమవారం 3536* వ రోజు నాటి శ్రమదాన ఘట్టములు!
వేకువ జాము 4.18 నిమిషాలకు 8 మంది కార్యకర్తలతో జాతీయ రహదారిపై చల్లపల్లి స్వాగతద్వారం సమీపంలో పనికి ఉపక్రమించారు. చిన్నగా నేనున్నానంటూ వర్షం చినుకులు మొదలైనప్పటికీ ఎవరి పని వారిదే అన్నట్లుగా కార్యకర్తలు పని ముట్లు చేతబట్టి సువర్ణ గన్నేరు మొక్కలకు క్రింది భాగంలో ఉన్న కలుపును, పిచ్చి మొక్కలను లాగి శుభ్రం చేసుకుంటూ వెళుతున్నారు.
రోడ్డు మార్జిన్ లో మాత్రం ఒక కార్యకర్త మిషన్ తో కట్ చేయటం వలన ఆ ప్రాంతాన్ని పదే పదే చూడాలనిపిస్తుంది.
మరికొంతమంది కార్యకర్తలు గంగులవారిపాలెం దారిలో స్వచ్చ కార్యకర్తలు నాటిన మొక్కల చుట్టూ కలుపు మరియు గడ్డిని తొలగించే పనిలో ఉండగా మహిళా కార్యకర్తలు వారు కొట్టిన గడ్డి, పిచ్చి మొక్కలను లాగి ప్రోగు చేయడం చేస్తూ, గడ్డి కోత యంత్రము చేస్తున్న పని వెనుక శుభ్రంగా ఊడ్చి ఆ ప్రదేశానికి సుందర రూపం తీసుకోస్తున్నారు.
అసలు ఆ పసుపు పూల మొక్కలు నాటి రెండు సంవత్సరాలు పూర్తయింది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ మొక్కల సంరక్షణలో ఎంతో మంది కార్యకర్తల కఠోరమైన శ్రమ దాగి ఉంది. కొద్ది రోజుల నుండి ఆ దారిన వెళ్ళేవారు కొంతమంది ఆగి పసుపు పూల సోయగాల నడుమ వారి ఫోటోలను సెల్ ఫోన్ కెమెరాలలో బంధించుట చూసి సంతోషమనిపించింది. అందుకేనేమో కవి “తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు” అని రాసింది.
వర్షాకాలం, ఉరుములు, మెరుపులు, చలిగాలులతో కూడిన చిన్నపాటి వర్షంలో కూడా చిమ్మ చీకటిలో వారివారి వాహనాలలో ఈరోజు మనం చేయవలసిన గ్రామ శుభ్రత కోసం వెతుక్కుంటూ వచ్చి హైవేలో వాహనాల స్పీడును తప్పుకుంటూ చేతిలోన పనిముట్లు నెత్తిమీద ఛార్జింగ్ లైట్ల వెలుగులో ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేకపోయినా ఈ ఊరిలోని అందరి ప్రయోజనాల కొరకు కష్టించే వీళ్లే నిజమైన త్యాగధనులు.
6 గంటల వరకూ పని చేస్తూ ఉన్న వీరికి మధ్యలో ఒక పాము (రక్తపింజర) వీరి మధ్యలో నుండి వెళ్లిపోతుండగా చూసిన మహిళా కార్యకర్త చెప్పగా అక్కడ అందరూ అప్రమత్తమయ్యారు. విరామం లేకుండా తడుస్తూ పనిచేసిన ఈ 14 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో సజ్జా ప్రసాదు గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి సాధిస్తాం సాధిస్తాం అంటూ గొంతు కలిపి,
రేపు మనం కలువవలసిన ప్రాంతం ఈ స్వాగతద్వారం వద్దనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాసరావు
ప్రజా కళాకారుడు
21.07.2025.
చల్లపల్లిలో వృక్ష విలాపం – 7
(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)
దశాబ్దంగా స్వచ్ఛ సుందర ఉద్యమం వికసించుచుంటే –
కార్యకర్తల చెమట చలువతొ చెట్లు ముప్పది వేలుపైగా
ఊరి అందం పెంచుచుంటే - ఉష్ణమును చల్లార్చుచుంటే -
చూడ జాలని మూర్ఖజీవుల చుప్పనాతితనం కదా ఇది?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
21.07.2025