ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!
23.07.2025 బుధవారం 3538* వ రోజు నాటి శ్రమదాన ఘట్టములు!
వేకువ జామున 4.12 నిమిషాలకు 9 మంది కార్యకర్తలు గంగులవారిపాలెం దారిలో పని మొదలుపెట్టారు. నిన్న జరిగిన స్వచ్ఛ సేవలకు కొనసాగింపుగా పిచ్చి మొక్కలు, గడ్డి కలుపును తీసివేసి కార్యకర్తలు నాటిన పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కల పెరుగుదలకు ఆటంకం లేకుండా చేశారు.
ఇద్దరు కార్యకర్తలు స్వాగత ద్వారం నుండి దారి ప్రక్క గద్దగోరు మొక్కలను క్రిందికల్లా కత్తిరించడం జరిగింది. మిగతా కార్యకర్తలు ట్రాక్టర్ లో లోడింగ్ చేసి యార్డుకు తరలించారు. ప్రక్కనే ఉన్న గంగులవారిపాలెం దళితవాడకు ఆ దారిని రెండు ప్రక్కలా మొక్కలతో అందంగా ఉండేలా చూడాలని కార్యకర్తలు కొద్ది కాలం క్రితం మొక్కలు నాటడం జరిగింది. ఆ కార్యక్రమంలో దళితవాడ యువకులు మహిళలు కూడా పాల్గొన్నారు. కానీ ఇప్పుడు అలా వదిలివేయడం సముచితమనిపించుట లేదు.
అందరూ కలిసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటూ, మొక్కలను సంరక్షించుకుంటూ ఉంటే ఆ దళితవాడ ప్రవేశ మార్గం ఎంతో సుందరంగా ఉంటుంది. స్వచ్ఛ కార్యకర్తలు పడిన కష్టానికి ఫలితముంటుంది.
ఈరోజు 6 గంటలు దాటినా సరే చేతిలో పని పూర్తికాక వరకూ పని చేసి అప్పుడు పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో మాలెంపాటి అంజయ్య గారు పలికిన
“జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టి,
రేపు కలువవలసిన ప్రదేశం “స్వాగత ద్వారం” వద్దనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాసరావు
ప్రజా కళాకారుడు
23.07.2025.
చల్లపల్లిలో వృక్ష విలాపం –9
(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)
ప్రజలు ఇది ఖండించ వలదా - ప్రభుత్వచర్యలు ఉండవలదా ?
సమాజంతో బాటు రక్షక భటులు మేల్కోని కదల వలదా?
చెట్లహత్యల నాప వలదా - పూలదొంగల పట్టవలదా?
కష్టజీవులు స్వచ్ఛ సుందర కార్యకర్తలు మెచ్చ వలదా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
23.07.2025