3548* వ రోజు ....           02-Aug-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

02.08.2025 శనివారం - 3548* వ రోజు నాటి స్వచ్చ యజ్ఞం చెమట చుక్కల చరిత్ర!

          వేకువజామున 4:22 నిమిషాలకు 17 మంది కార్యకర్తలతో గంగులవారిపాలెం దారి మలుపులో అపరిశుభ్రతపై యుద్ధం ఆరంభమైనది. ఆ సమయంలో చిమ్మ చీకట్లో అంతమంది ఒక చోటికి చేరి మొదటి ఫోటో దిగటం ఏమిటి అనుకోవచ్చు. కానీ అలాంటి నిద్రలేని రాత్రులు స్వచ్చ కార్యకర్తలు మొత్తం కొన్ని లక్షల గంటలు ఈ ఊరి బాగుకు త్యాగం చేశారు. అలాగే ఈ రోజు కూడా ఆ సమయంలో రహదారి మలుపులో ఆగి దారికి కమ్మేసిన చెట్ల కొమ్మలు, కలుపు గడ్డి, పిచ్చి దొండ తీగ లాంటి అనవసరమైన వాటిని మంచి మొక్కల నుండి వేరు చేసి ఆ దారిని ఇంకా వెడల్పుగా, ఖాళీగా ఉండేటట్లుగా చూపించారు.

          ఆ మలుపు నుండి కొంత భాగం మురుగు కాలువ గట్టు వెంట ఉన్న ముళ్ళ పొదలను కొట్టి వేసి కాలువ గట్టు అంచున రక్షణగా వేసిన కట్టను కొనసాగించారు. కానీ ఆ దారి ఒకసారి తేరిపార చూస్తే ఇంతకు ముందు మనం వెళ్ళిన రోడ్డు ఇదేనా అనిపిస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కరి చేరికతో 33 మంది కార్యకర్తలు పాల్గొని ఆ సమయంలో ఊరి కోసం సుమారు 2 గంటల పాటు ప్రతిరోజూ పని చేయడం అసాధారణ విషయం.

          దారి పొడవునా బాగు చేసిన గడ్డి, పిచ్చి మొక్కలు, కొమ్మలు ఇంకా తుక్కును వారు మోపులుగా లాక్కెళ్ళుతుంటే దారి అంతా పడిన చెత్తా చెదారాలు మహిళా కార్యకర్తలు అద్దంలా ఊడ్చి శుభ్రపరచడం వారికి వెన్నతో పెట్టిన విద్య.

          ఈ రోజు వాతావరణంలో వేడి ఎక్కువై ఉక్కపోతగా ఉండి పని చేస్తున్న ఈ స్వచ్చ శ్రామికుల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయినా 6 గంటలు దాటినా సరే ఎవరూ పని విడువకుండా అంతవరకు చాలా కష్టమయిన పనిని పూర్తి చేశారు. నిజంగా ఫలితం అందరిదైనా ఊరి కోసం కొందరు మాత్రమే రెక్కలు ముక్కలు చేసుకోవడం అంటే ఇదేనేమో.

          6 గంటలు దాటిన కొద్ది సమయం తరువాత విజిల్ మ్రోతకు పనికి విరామమిచ్చి కాఫీ సేవిస్తూ పని ముచ్చట్లాడి సమీక్షలో అడపా గురవయ్య గారు చెప్పిన “జై స్వచ్చ సుందర చల్లపల్లి” నినాదానికి ముక్త కంఠాలతో జై కొట్టారు.

          ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరగబోయే లయన్స్ క్లబ్ అధ్యక్షుని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరిని రమ్మని ఆహ్వానించిన ముమ్మనేని నాని గారికి, వరదా హరిగోపాల్ గారికి అభినందనలు తెలియ జేస్తూ,

          రేపు కలవవలసిన ప్రాంతం ఈ ప్రదేశమే అనుకుని ఇంటి బాట పట్టారు.     

- నందేటి శ్రీనివాస్

   ప్రజా కళాకారుడు  

   02.08.2025.

భక్త కోటి ప్రయాణాలు

చల్లపల్లి, శివరాంపుర స్పచ్ఛ కార్యకర్తల శ్రమ

నెల రోజుల్లో వీధికి నీరాజనమర్పిస్తూ

భక్త కోటి ప్రయాణాలు ముక్తి వైపు సాగువేళ

అదృష్టం పట్టుకొంది కదళీపురమార్గానికి!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   02.08.2025