ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 2003* (రెండు వేల) వ నాటి ప్రాభాత శ్రమదానం
ఈ నాటి వేకువ 4.00 - 6.05 సమయాల మధ్య యధావిదిగా – నిరాటంకంగా జరిగిన గ్రామ బాధ్యతా నిర్వహణంలో భాగస్వాములు 29 మంది. శ్రమాదాన లబ్ది చల్లపల్లిలోని రెండు – మూడు ప్రాంతాలకు - గంగులవారిపాలెం బాటలో, బందరు రహదారిలో, మొక్కలకు నీరందవలసిన మరికొన్ని వీధులలో!
మొన్నటి ఉదయం ఒక కార్యకర్త ఛలోక్తిగా అన్నాడు – “ఇది మన 2001 వ రోజు కాదయ్యా, ఒకటవరోజు” అని! “రెండువేల రోజులు – సుదీర్ఘ సేవలు....” ఇలాంటి వన్నీ వదిలేసి, మొదటి రోజు దీక్ష – వినయం – పట్టుదల – ప్రణాళికలతోనే నడుద్దాం..” అని కాబోలు అతని ఉద్దేశం! అతి సన్నిహితంగా ఇన్నేళ్ళుగా కార్యకర్తల అంకితభావాన్ని, కృషి వైవిధ్యాన్ని గమనిస్తున్న నాలో ఎన్నో ప్రశ్నలు, వాటికి సమాధానాలు కూడ తడుతుంటాయి. ప్రశ్నేమంటే – “ఈ ఆరేళ్ళ స్వచ్చోద్యమంలో ఈ నిష్కామ కర్మ వీరులు చల్లపల్లికి చేయకుండా వదిలేసిన సేవలేమిటి?” అని! ఊరిలో 10 ప్రాంతాలలో బహిరంగ విసర్జిత మలమూత్రాలు, చచ్చిన, కుళ్లిన జంతు కళేబరాలు వంటి వన్నీ తమ చేతులతో ఎత్తలేదా? చీపురు పట్టి రోడ్డెక్కి, లాగు – చొక్కాలు విప్పి మురుగు కాల్వలో దిగిన వాళ్ళకు ఈ పని – ఆ పని అనే విచక్షణ ఏముంటుంది? ఇక నేటి శ్రమదాన విషయానికొస్తే –
రేపటి శ్రమదాన సంకల్పంలోనూ మార్పులేదు - గంగులవారిపాలెం రోడ్డు, బందరు జాతీయ రహదారుల ప్రాంతాలలోనే!
నీరాజన మర్పిస్తా
ఈర్ష్యాద్వేషాలెరుగక – మద మాత్సర్యాలు లేక
పరుల కొరకు గంటన్నర పాటు బడే స్వచ్చోద్యమ
కారులనే కీర్తిస్తా – ఘనతను విశ్లేషిస్తా!
రెండు వేల నాళ్ళ శ్రమకు నీరాజన మర్పిస్తా!
- నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు ‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యులు,
బుధవారం – 06/05/2020,
చల్లపల్లి.