3556* వ రోజు....           10-Aug-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

10.08.2025 శనివారం - 3556* వ రోజు నాటి స్వచ్చ శ్రమదాన ఘట్టములు! 

          తెల్లవారు జాము 4:16 నిమిషాలకు 15 మంది స్వచ్చ కార్యకర్తలు ఆసుపత్రి దారిలో పని చేయుటకు స్ప్లెండర్ సిటీ అడ్డ రోడ్డు వద్ద కలిశారు. పదునైన కత్తులతో రోడ్డు మార్జిన్ లో గడ్డి, పిచ్చి మొక్కలను క్రిందికంటూ కోస్తూ అందంగా శుభ్రపరిచారు. ఒక కార్యకర్త పొడవాటి కటింగ్ యంత్రంతో కొన్ని పొడవైన మోడులను ఎత్తు తగ్గించడం, తీగజాతి పూల మొక్కలకు అవి పెరగటానికి అడ్డం వచ్చిన కొమ్మలను కట్ చెయ్యడం జరిగింది.

          ఒక బృందం చల్లపల్లి ప్రవేశ స్వాగత ద్వారం వద్ద చేయవలసిన మట్టి పనిని పూర్తి చేశారు. మహిళా కార్యకర్తలు మాత్రం పని చేసిన ప్రతి భాగాన్ని ఊడ్చి పోగులు ట్రాక్టర్ కు లోడింగ్ కు అందించడం ద్వారా దారి సర్వాంగ సుందరం గా తయారయింది.

          వాతావరణం మబ్బులతో ఉన్నా సరే ఎంతో ఉక్కపోతగా ఉండి కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మురుగు, డ్రైన్ పై వాలి మూసుకు పోయిన చెట్ల కొమ్మలను ఎంతో కష్టమయినా ఒక కార్యకర్త మొత్తం తొలగించి శుభ్రం చేశారు.

          6 గంటల వరకు విరామ మెరుగక చెమటోడ్చిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామం ఇచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొన్నారు. వెంకట రత్నం గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదంతో గొంతు కలిపి స్వచ్చ చల్లపల్లి గాయకుని గీతాలు విని, రేపు కలవవలసిన ప్రదేశం పద్మాభిరామం ముందర అనుకొని ఇంటి బాట పట్టారు.

          స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల సమీక్ష సమావేశం జరుగుతుండగా ఆ దారిన కుటుంబంతో కారులో వెళుతూ మన అనుమతి తీసుకుని తన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసుకోవడం గమనార్హం.   

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  10.08.2025.

          ఏ తర్కానికి అందదు

ఏ తర్కానికి అందదు ఈ పౌరుల మనోగతం

ఏ కోవకు చెందెదరో ఈ గ్రామంలోని జనం

తరతరాల ఊరి బూజు తొలగించే ఉద్యమాన్ని

పదేళ్ల తరువాతైనా పట్టించుకొనని వైనం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   10.08.2025