3557* వ రోజు ....           11-Aug-2025

పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

11.08.2025 సోమవారం 3557* వ రోజు నాటి శ్రమ యజ్ఞం!

          ఈరోజు 4:20 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్ లోని పద్మాభిరామం వద్ద 7 గురు కార్యకర్తలు ఫోటో దిగి పనికి ఉపక్రమించారు. కొందరు దారి ప్రక్కన గల గార్డెన్ లో విపరీతంగా పెరిగిన కలుపును, పిచ్చి మొక్కలను లాగి శుభ్రం చేశారు. లాగిన గడ్డి పోగులను పెద్ద గుట్టలుగా వేశారు. ఆ తరువాత దానిని లోడింగ్ చేశారు.

          6 గురు కార్యకర్తలు ఆసుపత్రి ఎదురుగా ఉన్న సిమెంటు రోడ్డులో కుడి ఎడమ భాగాలు శుభ్రం చేసే పనిలో గడ్డి కలుపు విపరీతంగా పెరిగి ఆదారి మూసుకొస్తున్న తరుణంలో ఒక బృందం కార్యకర్తలు ఆ పని ఎంతో చక్కగా చేసి దారి వెడల్పయినట్లుందనిపించారు. మరొక దళం మురుగు నీటి డ్రైను ప్రక్కన ఏపుగా పెరిగి రోడ్డు మీదకి వంగిపోతున్న మెట్ట తామర మొక్కలను వేళ్ళతో సహా వేరొక చోట పెట్టుటకు వీలుగా మొత్తం తొలగించారు.

          వేకువనే వర్షం పడి పనికి ఇబ్బంది ఉన్నా కార్యకర్తలలో స్వచ్ఛ స్ఫూర్తి మాత్రం చెక్కు చెదరలేదు. ఒక్కొక్కరూ వచ్చి మొత్తం 26 మంది కార్యకర్తలూ పనిలో వంగి ఆదారిని చక్కగా బాగుచేశారు. ఒక కార్యకర్త మిషన్ తో అక్కడక్కడా కట్ చేయవలసిన కొమ్మలను కత్తిరించడం జరిగింది.

          స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం ప్రారంభం నుండి ఈరోజు వరకూ గ్రామ శ్రేయస్సే ధ్యేయంగా ఎండా వానా చలి లెక్కచేయకుండా ఆ లక్ష్యాన్ని నరనరాన జీర్ణించుకొన్న కార్యకర్తలు మా సమయ శ్రమలను ఈ గ్రామ స్వచ్ఛత కోసం అంకితమని చెప్పి శ్రమ చేస్తుంటే ఇంకా గ్రామంలోని కొంతమంది జనం ఈ బాధ్యత వారిదే కానీ మాకేమి సంబంధం అన్నట్లుగా ఉండడం చాలా విచారకరం.

          6 గంటల వరకు కష్టించిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప జరిగిన సమీక్షలో గంధం బృందావన్ పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జై కొట్టి,

          రేపు కలవవలసిన ప్రదేశం హైవే లో కాసానగరం వద్ద అనుకుని నిష్క్రమించారు.             

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  11.08.2025.

 

        అదృష్టమనగ 216 వ రహదారిదే!

ఊరిలో బజార్లుండగ - విజయవాడ రోడ్డుండగ

ఖాళీ నివేశన స్ధలాలుండగ, గుడులుండగ - బడులుండగ

బందరు రహదారి కొరకు ఇందరు కష్టించుటన్న

అదృష్టమనగ 216 వ రహదారిదే!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

  11.08.2025.