3560* వ రోజు ....           14-Aug-2025

 ఒకే ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను తక్షణమే మానేద్దాం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 3560* వ రోజు నాటి సంగతులు!

          నేడు 216 జాతీయ రహదారిలోని కాసానగర్ జంక్షన్ వద్ద ఉన్న చెక్ పోస్ట్ వద్ద వేకువ 4:19 నిమిషాలకు 11 మంది కార్యకర్తలు కలుసుకుని చెక్ పోస్ట్ వద్ద నుండి మచిలీపట్నం వైపు రోడ్డుకి ఎడమ ప్రక్కన గతంలో పెట్టిన సువర్ణగన్నేరు మొక్కల వద్ద పాదులు చేసి,

          ఎగువ – దిగువ భాగాల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను, గడ్డిని చేతులతో కుదుళ్ల నుండి లాగి వాటిని గుట్టలుగా పోశారు.

          కాసానగర్ జంక్షన్ వద్ద నుండి చల్లపల్లికి వెళ్ళే రహదారికి కుడి వైపున గుడి ప్రక్కన రోడ్డు కోతకు గురౌతుందని ముందుగా గమనించి మట్టి కొట్టుకుపోకుండా ఉండడానికి గుట్టలుగా అమర్చిన ప్రోగులను ట్రాక్టర్ లో లోడ్ చేసుకుని పోశారు.

          ఒకే ఒక్క కార్యకర్త జాతీయ రహదారికి కుడి వైపున మొలిచిన కలుపు మొక్కలను గడ్డి కోత మిషన్ ద్వారా ట్రిమ్ చేశారు.

          6:15 నిమిషాలకు విజిల్ మ్రోగిన తర్వాత 19 మంది కార్యకర్తలు నేటి శ్రమదానోద్యమానికి సెలవిచ్చి, కాఫీ సేవించిన పిదప పాల్గొన్న సమావేశంలో ఆసుపత్రి సిబ్బంది బొంతు సౌభాగ్యవతి” పలికించిన నినాదాలను పలికి,

          స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు గౌరిశెట్టి నరసింహారావు, కస్తూరి శ్రీనివాసరావుల రక్తదానం గూర్చి విషయాలను డాక్టరు వివరించగా కార్యకర్తలంతా శ్రద్ధగా విని,

          అడపా గురవయ్య గారు పాడిన పద్యాన్ని విని గృహోన్ముఖులయ్యారు.

          రేపటి శ్రమదానోద్యమం ఈరోజు ముగిసిన చోటు అనగా హైవే లో కాసానగర్ జంక్షన్ చెక్ పోస్ట్ కి కొంచెం ముందు భాగం వద్ద!     

- ప్రసాద్ వేల్పూరి

   స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త

   14.08.2025.

 

          ఆరాటము తగ్గకుంది!

ఈ సమాజమున కెవ్వరు ఆదర్శ ప్రాయులనిన

శ్రమ జీవన సౌందర్యపు ప్రబోధకులు ఎవ్వరనిన

స్వచ్ఛ కార్యకర్తలె ఆ ప్రశ్నలకు జవాబులనిన

ఔనౌనని చాటనిదే ఆరాటము తగ్గకుంది!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   14.08.2025.