పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
16.08.2025 శనివారం 3562* వ రోజు నాటి స్వచ్చోద్యమ శ్రమ యజ్ఞం!
తెల్లవారుజాము 4:20 నిమిషాలకి షెడ్యూలు ప్రకారం జాతీయ రహదారి పై కాసానగర్ జంక్షన్ వద్ద 13 మంది కార్యకర్తలు కార్యోన్ముఖులయ్యారు. రోడ్డుకు దిగువ భాగాన ( మేకల డొంక వైపు) ఉన్న చెత్తా చెదారాలు, గాజు సీసాలు తొలగించారు. శుభ్రం చేయగా వచ్చిన గడ్డిని ఎక్కువ భాగం వేరొక అవసరమయిన పనికి తరలించారు. కొంత భాగాన్ని అంచు కట్టి అందంగా తయారు చేశారు.
ఆ ప్రాంతంలో అంతకు ముందు ఉన్న మొక్కలకు తోడు ఖాళీ లో రేపు నాటించవలసిన చింత మొక్కలకు గోతులు తవ్వారు. నిన్న కాసానగర్ మలుపులో రోడ్డు మార్జిన్ కోతకు గురి కాకుండా చేపట్టిన రక్షణ చర్యలలో ఈ రోజు కొంత మేర కొమ్మలను, తుక్కును వేసి సరి చేశారు.
వేరొక బృందం వారు చల్లపల్లి ప్రవేశ ప్రదేశమైన స్వాగత ద్వారం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన మోడల్ రెయిలింగ్ ముందు మెరకా, పల్లం సరిచేసి నేలను చక్కగా చేశారు. ఈ రోజు 4 గంటలకు అక్కడ ప్రారంభ కార్యక్రమానికి సుందరంగా తీర్చి దిద్దారు.
6 గంటల వరకు మొత్తం 36 మందికార్యకర్తలు శ్రమించి విజిల్ మ్రోగగానే పనికి విరామ మిచ్చి కాఫీ సేవించిన పిదప జరిగిన సమీక్షలో అడపా గురవయ్య మాస్టారు చెప్పిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదానికి జై కొట్టి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో స్వచ్చ సుందర చల్లపల్లి ప్రతినిధిగా ప్రశంసా పత్రం అందుకొన్న ప్రాతూరి శాస్త్రి గారికి అభినందనల సత్కారాన్ని అందించి,
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైవే లోని స్వచ్చ సుందర స్వాగత ద్వారం వద్దకు అందరూ రావాలని, 5 గంటలకు పద్మాభిరామం లో జరిగే మురళీ కోలాట ప్రదర్శన తిలకించాలని చెప్పటం జరిగింది.
హైదరాబాద్ వాస్తవ్యులు డా. డి.ఆర్.కె. ప్రసాద్ గారి మిత్రులు బాలు గారు వారి భార్య ఉమా గారు ఈనాటి స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రేపు కలవవలసిన ప్రదేశం ఈ కాసానగర్ జంక్షన్ లోనే అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
16.08.2025.
చక్కని అధ్యాయంబట!
నవ్వుతుంటే స్వచ్చోద్యము నాపచేను పండిందట!
సందేహాలన్నిటికీ సమాధాన మిచ్చిందట!
స్వచ్చ- శుభ్ర సత్కార్యం చవిచూపిందట జనులకు
అది - చల్లపల్లి చరిత్రలో చక్కని అధ్యాయంబట!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
16.08.2025.