పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
18.08.2025 సోమవారం 3564* వ రోజు నాటి స్వచ్ఛ సేవా కారక్రమం!
వక్కలగడ్డ దళితవాడ ప్రక్కనే గల పంట కాలువ (గట్టు) ప్రక్క దారి పరిశుభ్రం చేయడానికి తెల్లవారుజామున 4:14 నిమిషాలకు 9 మంది కార్యకర్తలు మొదటి ఫోటో దిగి పనికి సిద్ధమయ్యారు.
మన స్వచ్ఛ కార్యకర్త డ్రైవర్ ఆనందరావు భార్య ప్రధమ వర్ధంతిని పునస్కరించుకుని ఆదారిని బాగు చేసి మొక్కలు పెట్టాలని భావించి అందరికీ తెలియజేయడంతో ఈరోజు మన కార్యక్రమం అక్కడ జరిగింది.
కాలువ గట్టు దారి ప్రక్కన మాచర్ల కంప, గడ్డి, పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తూ అడ్డ రోడ్డు వరకూ పని సాగింది. మనం చేసే పనిలో స్థానికులు 6 గురు వచ్చి కలిసి పని చెయ్యడం మాత్రం ఒక మంచి పరిణామం.
కొద్ది మంది కార్యకర్తలు శుభ్రం చెయ్యగా వచ్చిన చెత్తా చెదారాలను ట్రాక్టర్ లో లోడింగ్ చేశారు. 4:30 నుండి వర్షం సన్న జల్లులు పడుతూనే ఉన్నా కార్యకర్తలు మాత్రం సమయం ముగిసేంత వరకూ తడుస్తూ పని చేస్తూనే ఉన్నారు. తదుపరి కాలువ గట్టు పొడవునా సువర్ణ గన్నేరు మొక్కలను నాటడం జరిగింది.
6 గంటల వరకూ తడుస్తూనే పని చేసిన 31 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే కాఫీ సేవించిన పిదప సమీక్షలో ‘గొరిపర్తి నాగ శేషు’ పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి మరియు స్వచ్ఛ వక్కలగడ్డ నినాదాలకు జై కొట్టి,
స్థానిక యువకుడు మాట్లాడుతూ మేము గ్రామంలో తలపెట్టిన ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా మాకు “స్వచ్ఛ చల్లపల్లి” ఉద్యమమే స్ఫూర్తి అన్నారు.
స్వచ్ఛ సేవలో పాల్గొన్న వక్కలగడ్డ PACS అధ్యక్షులు హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ గారు మాట్లాడుతూ చల్లపల్లిలో చేస్తున్న స్వచ్ఛ సేవ ఎంతో ప్రశంసనీయం. మేము కూడా త్వరలో “స్వచ్ఛ వక్కలగడ్డ” ని ప్రారంభిస్తామని చెప్పారు.
రేపు మనం కలుసుకోవలసిన ప్రదేశం హైవే లోని గంగులవారిపాలెం రోడ్ వద్ద అనుకుని నిష్క్రమించారు.
నిన్న, మొన్న మన “స్వచ్ఛ సుందర చల్లపల్లి” ని సందర్శించడానికి వచ్చిన గుంటూరు మెడికల్ కాలేజి - 1974 బ్యాచ్ లోని ఒకరైన డా. కనగాల ప్రసన్న కుమార్ గారు చల్లపల్లి అభివృద్ధి కోసం “మనకోసం మనం” ట్రస్టుకు 10,000/- రూపాయలను ఆన్లైన్ లో బదిలీ చేశారు. గత సంవత్సరం కూడా వీరు 10 వేల రూపాయలను అందించడం జరిగింది. అదే బ్యాచ్ లోని డాక్టర్లైన పద్మలక్ష్మి, ఝాన్సీ, ప్రీతి, రేణుక గార్లు కూడా 20,000/- రూపాయలను విరాళంగా అందజేశారు. వీరందరికీ స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
18.08.2025.
పూతి గంధ దుశ్చరిత్ర
గంగుల పాలెం రోడ్డుకు కలదిప్పుడు ఘనచరిత్ర
పుష్కర కాలం క్రితమది పూతి గంధ దుశ్చరిత్ర
కార్యకర్త శ్రమేగదా! కారణమీ మార్పునకు?
సంకల్పం నెరవేరదు శ్రమ సహకారం దొరకక!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
18.08.2025.