ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
21.08.2025 – గురువారం 3567* వ రోజు నాటి శ్రమ జీవుల పని పాటలు!
తెల్లవారుజామున 4:13 నిమిషాలకు హైవేలోని “స్వాగత ద్వారం” కు కొద్ది దూరంలో 9 మంది కార్యకర్తలు నిన్నటి పనికి కొనసాగింపుగా అక్కడికి చేరుకుని మొదటి ఫోటో దిగారు. తదుపరి వారి వారి పనిముట్లను చేతబట్టి రోజువారీ లాగానే పనిలో దిగారు.
హైవే రోడ్ లో రెండవ ప్రక్కన అనగా కళ్యాణ మండపం వైపు మొక్కలలో విపరీతంగా మొలిచిన కలుపు మొక్కలు పూల మొక్కలను చుట్టుముట్టిన పిచ్చి దొండతీగ, అలాగే తడిసి, ఎండి, విరిగిన ముళ్ళ కంపలు అయినా సరే వీటన్నింటినీ అధిగమించి శుభ్రంగా బాగు చేసి మనం పెట్టిన పూల మొక్కలు, నీడ నిచ్చు మొక్కలకు గాలి వెలుతురుతో కూడిన స్వేచ్చ ప్రసాదించారు.
ఎంత కష్టమైన పని అయినా కార్యకర్తలు మాత్రం ఎంతో ఇష్టంగా చేస్తారు. దీనికి కారణం గ్రామ స్వచ్చ శుభ్రతకు వీరు కంకణబద్ధులై ఉన్నారు. కాబట్టి మరికొందరు కార్యకర్తలు స్వాగత ద్వారం ప్రక్కనే నూతనంగా నిర్మించిన మోడల్ ‘బ్యారి కేడ్స్’ కింది భాగంలో మట్టిని నింపటానికి దారి వెనుక పుల్లలు పాతి మట్టి కొట్టుకుపోకుండా పరిరక్షణా చర్యలు చేపట్టారు.
మరొకవైపు మొక్కల చుట్టూ గడ్డి - కలుపు తీసి రోడ్ మీద గుట్టలు పెట్టగా ఒక బృందం ట్రాక్టర్ లో లోడింగ్ చేశారు.
6 గంటల వరకు కష్టించిన 26 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించి సమీక్ష సమావేశంలో డాక్టరు గారు గత నెలకు సంబంధించిన ట్రస్ట్ ఆర్ధిక వ్యవహారాలను చదవగా విని,
‘కస్తూరి విజయ్’ పలికిన ‘జై స్వచ్చ సుందర చల్లపల్లి’ నినాదానికి జై కొట్టి,
రేపు ఇదే హైవేలో కొంచెం ముందర కలుద్దాం అనుకుని నిష్క్రమించారు
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
21.08.2025.
స్వచ్ఛోద్యమమే కోవకుచెందినదో!
కండూతి భరించలేక ఘర్మజలంకార్చెదరో
కీర్తి దురద నాప లేక శ్రమదానంచేసెదరో
సమాజాన్ని మేలుకొల్పు సాహసమే - ఏదైనా
ఏకాదశ వసంతాల స్వచ్ఛోద్యమమే కోవకుచెందినదో!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
21.08.2025.