3570* వ రోజు....           24-Aug-2025

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

24.08.2025 ఆదివారం - 3570* వ రోజు నాటి స్వచ్చ సేవా యజ్ఞం!

          వేకువ జాము 4.19 ని.లకు జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న శారదా గ్రాండియర్ ఫంక్షన్ హాలు వద్ద 16 మంది కార్యకర్తలు పనికి సిద్ధమయ్యారు. పనిముట్లు చేతబట్టి రహదారి ప్రక్కన మొక్కలను అల్లుకొన్న పిచ్చి తీగ, కలుపు గడ్డి వీటన్నింటిని తీసివేసి మనం నాటిన మంచి మొక్కలు బాగా పెరిగేలా కార్యకర్తలు గత 2 నెలలు పై బడి వీటి పరిరక్షణ కొరకు చెమటోడ్చుతున్నారు.  

          గత కొద్ది రోజులుగా చూస్తే స్వచ్చ చల్లపల్లి సేవకు యువతరం ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం, మిగతా కార్యకర్తలతో కలసి పని చేయడం ఒక మంచి పరిణామం. దేశ ప్రగతి, దేశ భవిష్యత్తును నిర్దేశించాల్సిన యువతరం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములయినప్పుడు అనుకున్న లక్ష్యాలను వేగంగా సాధించగలము.

          10 మంది కార్యకర్తలు స్వాగత ద్వారం వద్ద, రెండవ ప్రక్కన కూడా సుందరంగా తయారు చేసే పనిలో నిమగ్నమయి లాన్ వేయడానికి అవసరమయిన ప్రాధమిక చర్యలను చేపట్టినారు. హైవే మార్జిన్ లో పెరిగిన గడ్డిని మిషన్ తో ఒక కార్యకర్త తన శక్తి కొలదీ ప్రతిరోజు కట్ చేయడం వలన రహదారి పని చేసినంత పొడవునా పూల చెట్లతో "హైవే సొగసు చూడతరమా" అన్నట్లుంది.

          6 గంటలు దాటినా కూడా పని చేస్తూనే ఉన్న కార్యకర్తలను పని విరమింప చేయడానికి కూడా చాలా శ్రమించాల్సి వస్తుంది. ఊరి బాగుకు చెమటను ధారపోయడానికి 11 సంవత్సరాలుగా అలవాటుపడ్డ కార్యకర్తలకు చేస్తున్న పనిని ఖచ్చితమైన సమయానికి ఆపి రావడం ఎంతో కష్టంగానే ఉంది. అదే చల్లపల్లికి - స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం.

          విజిల్ మ్రోగిన సమయానికి పని విరమించిన 46 మంది కార్యకర్తలు కాఫీ సేవిస్తూ కొద్ది సేపు పని పాటల ముచ్చట్లతో చెమట తడిని ఆరనిచ్చి సమీక్షలో పాల్గొన్నారు. రాయపాటి రాధాకృష్ణ మూర్తి గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదానికి ముక్త కంఠంతో జేజేలు పలకగా డాక్టరు గారు మాట్లాడుతూ హైవే పై మనం 10 మంది కొరకు చేసే ఈ పనిలో ఎవరు ఎలాంటి చిన్న రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా చాలా అప్రమత్తంగా ఉండాలని అనేక జాగ్రత్తలు కార్యకర్తలకు చెప్పారు. తదుపరి గురవయ్య మాస్టారి నీతి సూక్తులు విని రేపు కూడా మనం ఈ శారదా గ్రాండియర్ వద్ద కలుసుకుందామనుకొని నిష్క్రమించారు.    

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  24.08.2025.

చల్లపల్లిలో స-రి-గ-మ-ప-ద-ని-స’ – 3

 

T. పద్మావతి నేతృత్వములో మహిళలు చీపురు చేతబట్టగా

'అతివలు పురుషుల కన్న తక్కువా?’ అని పనులన్నీ చేయుచుండగా

అహో! చివరికా చెత్తబండిపై చెత్త-చెదారం త్రొక్కి సర్దగా

స్వచ్ఛ సంస్కృతుల స-రి-గ-మ-ప-ద- ని స చల్లపల్లిలో కనిపించెనుగా!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   24.08.2025.