ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
26.08.2025 మంగళవారం – 3572* వ రోజు స్వచ్చ సేవల వివరములు!
ఈరోజు తెల్లవారుజాము 4:13 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు హైవేలోని “శారదా గ్రాండియర్” వద్ద కలుసుకుని మొదటి ఫోటో దిగి రోజు వారి పని ప్రారంభించారు.
తదుపరి కొద్ది సమయానికి ఒక్కొక్కరుగా వచ్చి మొత్తం 24 మంది కార్యకర్తలు మొక్కల సంరక్షణా చర్యలలో భాగస్వాములయ్యారు. వారిలో కొద్ది మంది కార్యకర్తల బృందం కూడా పెద్ద మొక్కల మొదళ్ళకు మట్టి వేసి పరిరక్షణా చర్యలు చేపట్టారు.
రహదారి మార్జిన్ లు మాత్రం కటింగ్ మిషన్ తో కట్ చేస్తుంటే రహదారి ఎంత బాగుందో మాటలలో వర్ణింపలేనిది.
11 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఈ ఉద్యమ ప్రస్థానంలో రోజు వారి తెల్లవారుజాము చేసే ఈ చెమట దారబోసే శ్రమ చూసే వారికి ఒకింత ఆశ్చర్యంగానూ, వింతగానూ, కొంత జెలసి గానూ ఉన్నా స్వచ్చ కార్యకర్తలది మాత్రం ఓ క్రొత్త ఒరవడి. అదేమంటే ప్రతిరోజూ నూతనోత్సాహం, చెక్కు చెదరని స్ఫూర్తి మొక్కవోని దీక్ష, కొండ చరియలు కూలిపోనీ, సముద్రాలు ఉప్పొంగనీ మా లక్ష్యాన్ని చేరగలమన్న అచెంచల విశ్వాసం, మా స్వచ్చ కార్యకర్తల స్వేదబిందువుల కష్టం నుండి ఆవిర్భవించిన ఈ ఫలితాన్ని స్వచ్చ సుందర చల్లపల్లిగా చరిత్ర పుటల్లో లిఖిద్దాం.
6 గంటల దాటినా పని ముగించి రాని కార్యకర్తలు విజిల్ వేసినా కూడా అతి కష్టం మీద పని విరమించి రావడం కాఫీ సేవించడంతో సేదతీరి కోడూరి వేంకటేశ్వరరావు గారి గంభీర స్వరంతో వినిపించిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జేజే లు పలికి,
డా. సోమరాజు గారు వారి బృందం చల్లపల్లి సందర్శన గూర్చి డాక్టరు గారు వివరణ అనంతరం,
రేపు మనం కలువవలసిన ప్రాంతం “చల్లపల్లికే మణిహారం – మన స్వాగత ద్వారం” వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
26.08.2025.
చల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 5
ఆసుపత్రిలో చిన్న డాక్టరు సతీమణి తోడుగ బయలుదేరితే
మహాలక్ష్మి M., శారద, దుర్గ, రిసెప్షన్ లక్ష్ములు అనుసరించితే
పద్మావతి ఆస్పత్రి సిబ్బంది కాలుష్యముపై కలబడుతుంటే
చల్లపల్లి కొంగ్రొత్త సంస్కృతీ సంగీతము ప్రసరించుచుండెలే!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
26.08.2025.