3575* వ రోజు ....           29-Aug-2025

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

29.08.2025 శుక్రవారం 3575* వ రోజు నాటి స్వచ్చ శ్రమదాన సన్నివేశములు!

          216 జాతీయ రహదారిపై బండ్రేవుకోడు వంతెన వద్ద వేకువజాము 4:19 నిమిషాలకు 9  మంది కార్యకర్తలు మొక్కల పరిరక్షణా చర్యలకు సిద్ధమయ్యారు.

          వంతెన వద్ద నుండి మొదలుపెట్టి దారి ప్రక్కన మొక్కలలో కలుపు, పిచ్చి గడ్డి ఏరివేస్తూ వంతెన మీద ఇటీవల బాగుచేసినా వర్షాలకు మొలిచిన పిచ్చి మొక్కలను లాగి పరిశుభ్రం చేశారు.

          మొక్కల మొదళ్ళలో గడ్డి లేకుండా పాదుల చుట్టూ శుభ్రం చేస్తుండడం, రహదారి ప్రక్కన మార్జిన్ లో గడ్డిని మాత్రం ఒక కార్యకర్త మిషన్ తో కట్ చేయగా మిషన్ బరువును మోస్తూ ఎక్కువ దూరం కత్తిరించి చేసిన పనిని ఒక దఫా వెనుతిరిగి చూస్తే ఎంత కష్టమైనా ఇష్టంతో చేసిన ఆ పని ఫలితం ఎంత బావుంటుందో రహదారి అందం చెపుతుంది.

          మరికొంతమంది కార్యకర్తలు పెద్ద మొక్కల మొదళ్ళకు మట్టి వేస్తూ బలం చేకూర్చుతున్నారు.

          6 గంటల సమయం వరకు 21 మంది కార్యకర్తలు విశ్రమించక పనిచేసి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి ఆకుల దుర్గా ప్రసాద్ గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి కి గొంతు కలిపి జై కొట్టారు.

          టాక్సీ ఓనర్ చాన్ గారి కుమార్తె చాందిని తన భర్తతో స్వచ్చ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమం దగ్గరకి వచ్చి 10 వేల రూపాయలను స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం డా. పద్మావతి మేడమ్ గారికి అందించారు.

          రేపు కలువవలసిన ప్రదేశం ఈ వంతెన వద్ద అనుకొని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  29.08.2025.

 

చల్లపల్లిలో స-రి-గ-మ-ప-ద-ని-స’ – 9

పెద్దలెందరో మహానుభావులు-ముఖ్యంగా మానేసిన పెద్దలు

అప్పుడప్పుడీ స్వచ్ఛ సేవలకు అరుదెంచుచు దీవించుచుండుడని

వినయపూర్వముగ వేడుకొనుచుంటి - మనమందరమూ కలిస్తేనె ఈ

స్వచ్చోద్యమ సంగీత విభావరి చాలా దూరం వినిపించాలని!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   29.08.2025.