పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
04.09.2025 గురువారం 3581* వ రోజు నాటి స్వచ్చ సేవల వివరములు!
జాతీయ రహదారిపై “శారదా గ్రాండియర్” వద్ద తెల్లవారుజాము 4:15 నిమిషాలకు 10 మంది కార్యకర్తలు మొదటి ఫోటో అనంతరం పని ప్రారంభించారు. కార్యకర్తలు ఏడాది క్రితం నాటిన మొక్కలలో కలుపు ఏపుగా పెరిగి మొక్కలను కమ్మి వేసి చిట్టడవిని తలపిస్తుంది.
*కార్యకర్తలు పదునైన కత్తులతో పెరిగిన కలుపు, పిచ్చి మొక్కలపై సమరానికి సై అన్నారు.
* గుట్టల కొద్దీ చెత్తను కొట్టి కార్యకర్తలు పైకి వేయడం, మహిళా కార్యకర్తలు వాటిని గుట్టగా ప్రోగు చేసి ట్రాక్టర్ లో లోడింగ్ కు సిద్దం చేశారు.
* మరొక కార్యకర్త మిషన్ చేతబట్టి దారి పొడవునా మార్జిన్ లోని గడ్డిని కట్ చేస్తూ ఉన్నారు.
* కొంతమంది కార్యకర్తలు దారికి రెండవ వైపున ఉన్న సువర్ణ గన్నేరు మొక్కలలో పాదుల మొదట్లో ఉన్న కలుపును పూర్తిగా ఏరివేయడం జరుగుతూ ఉంది.
ఇన్ని పనులు ఇంతమంది కార్యకర్తలు చేస్తుంటే జాతీయ రహదారి చల్లపల్లి భూభాగం పొడవునా పచ్చని చెట్లతో, పూల మొక్కలతో అందాలను ఇస్తుంది.
చివరి ఘట్టమైన లోడింగ్ పూర్తి చేసి 6 గంటల తరువాత విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చిన కార్యకర్తలు, కాఫీ సేవించి,
తదుపరి సమీక్షలో నెలవారీ చందాలైన డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి 2,000/-, కోడూరు వేంకటేశ్వరరావు గారి 520/- విరాళాలాను అందుకుని,
RTC డ్రైవర్ తోట నాగేశ్వరరావు గారు “జై స్వచ్చ సుందర చల్లపల్లికి” అని చెప్పగా అందరూ గొంతు కలిపి జై కొట్టి,
నాగేశ్వరరావు గారు చెప్పిన ఉచిత బస్సు పధకంలోని సిత్రాలను విని నవ్వుకుని,
రేపు కలువవలసిన ప్రదేశం “శారదా గ్రాండియర్” వద్ద అనుకుని ఇంటి బాట
పట్టారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
04.09.2025.
ఇప్పటికీ మిగిలారని!
“గ్రామానికి మేలనుకొని - సామాజిక హితమనుకొని
తమ ఒంటికి మంచిదనీ - సర్వజనామోదమనీ
స్వచ్ఛ కార్యకర్తలిట్లు శ్రమకు పూనుకొన్నారని”
తెలియని నా గ్రామస్తులు ఇప్పటికీ మిగిలారని!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
04.09.2025.