3584* వ రోజు ....           07-Sep-2025

 ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

07.09.2025 శుక్రవారం - 3584* వ రోజు నాటి స్వచ్చ శ్రమదాన ఘట్టములు !   

          ఈ రోజు కూడా జాతీయ రహదారి పైనే పని. వేకువ జామునే 4.14 ని.లకు 12 మంది కార్యకర్తలు వారి బైకులు, సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యాను ఇవన్నీ నిలుపుకోవడానికి ఎక్కువ ఖాళీ ప్రదేశమున్న శారదా గ్రాండియర్ వద్ద కలుసుకున్నారు. ఫోటో దిగి చకచకా పనికి సమాయత్తమయ్యారు.

          శారదా గ్రాండియర్ కు ఎదురుగా అనగా హైవే కు అవతలి వైపు సువర్ణ గన్నేరు మొక్కలలో నీడనిచ్చు మొక్కలలో, కొబ్బరి మొక్కలలో కలుపు ను ఏరి వేయడం, రెల్లు గడ్డిని వీటి మధ్యలో లేకుండా హతమార్చడం.

          పాదులకు కట్టిన ముళ్ల విరిగిపోయి పడిపోయిన వాటిని తీసి వాటిని మొక్కలకు మేకల నుండి, గేదెల నుండి రక్షణగా పాతడం ఈ ఆపరేషన్ లో వచ్చిన చెత్త, తుక్కులను ట్రాక్టర్ లో లోడింగ్ చేసి బాగా మట్టి కొట్టుకు పోయే పల్లపు ప్రాంతం లో వేయడం.

          ఆదివారం అయ్యేసరికి అందరూ రోజూ కన్నా ఇంకా ఎక్కువ సేపు హుషారుగా పని చేయడం, ఉత్సాహంగా కబుర్లు చెప్పడం ఎప్పుడూ జరిగేదే. ఎందుకంటే అందరికీ ఆదివారం సెలవు కాబట్టి వారివారి విధులకు హాజరవనవసరం లేదని స్వచ్చ సేవలో గడపడం ఆనందంగానే భావిస్తారు.

          క్రమక్రమంగా వచ్చిన 39 మంది కార్యకర్తలు 6.10 ని.ల వరకూ శ్రమ చేస్తూనే ఉన్నారు. చివరికి పని విరమించేది మాత్రం గడ్డి కటింగ్ మిషన్ మాత్రమే. ఎందుకంటే ఆ యంత్రం తోనే రెండు ప్రక్కలా చేయవలసిన పని గదా ఎక్కువ “పుడమి యంత శ్రమ యాగపు వేదికగా నిజానికి  - పనిపాటల సోదరులే పునాదులు- ఈ భువనానికి”  అన్నట్లుగా గంటన్నర పైగా అలుపెరుగక చెమట  చిందించి కాఫీ విరామంలో వారు మాట్లాడుకునే పని పాటల ముచ్చట్లు, ఛలోక్తులు భలే పసందుగా ఉంటాయి.

          6.10 ని.లకు విజిల్ మ్రోగగానే అంతా పని విరమించి కాఫీ సేవించిన పిదప సమీక్షలో రాయపాటి రాధా కృష్ణ గారు ఆరోహణ అవరోహణ లో పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదానికి జై కొట్టి , “తరలుదాము రండి స్వచ్చ చల్లపల్లి” కి అంటూ సాగిన శ్రీనివాస్ గేయం విన్నారు.

          డాక్టరు గారు మాట్లాడుతూ నవంబర్ 9 న పదకొండవ వార్షికోత్సవానికి అతిథులుగా వందేమాతరం శ్రీనివాస్ గారు, MP విజయేంద్రప్రసాద్ గారు అని సూచనా ప్రాయంగా చెప్పి, రేపు కలవవలసిన ప్రాంతం ఈ శారదా గ్రాండియర్ వద్ద అనుకుని నిష్క్రమించారు.      

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  07.09.2025.

ప్రశ్నల పరంపర – 3

కార్యకర్తల నడిగి చూశా “చిమ్మ చీకటి సేవలేలని,

వానలందున నానుటేలని, పావులక్ష జనంలో మీ

కొద్దిమందికె పట్టెనా” అని, మందహాసం చేసి చెప్పిరి –

“ఎవరి సంగతొ ఎందుకిది మా బాధ్యతే నని’, ‘సేవకాదని!”

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   07.09.2025.