3585* వ రోజు ....           08-Sep-2025

 ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

08.09.2025 సోమవారం – 3585* వ రోజు నాటి శ్రమైక జీవన సౌందర్యం!

          జాతీయ రహదారి ప్రక్కన ఉన్న శారదా గ్రాండియర్  వద్ద ఈరోజు తెల్లవారు జామున 4.17 ని.లకు పని ప్రారంభించినది 11 మందితో,

          రహదారి కి రెండవ వైపు అనగా (బందరు వైపు) ఎడమ ప్రక్క రోడ్డు క్రింది భాగంలో మొక్కల పెరుగుదలకు తీవ్ర ఆటంకంగా పరిణమించిన రెల్లు గడ్డిని కోసి మొక్కల చుట్టూ ఖాళీ చేయడం.

          పెద్ద కత్తులు, కోత కొడవళ్ళు చేతబట్టి వంచిన నడుములెత్తకుండా అత్యంత కష్టమైన పనిని కార్యకర్తలు ఎంతో ఓపికగా చేయడం గమనార్హం. మరొక బృందం ఇంతకుముందు పనికి అడ్డుగా వచ్చి తొలగించిన మొక్కల చుట్టూ ముళ్ళ కంపను తిరిగి సరిచేసి రక్షణగా పాతడం జరుగుతుంది.

          నేడు ఆసుపత్రి దారి కానీ, హైవే రోడ్ లో అటు ఇటు కానీ మనం తేరిపార చూస్తే “నడిచే దారిలో నవ్వే పువ్వులు” అన్నపాట గుర్తుకు వస్తుంది.    

          చల్లపల్లి భూభాగం పొడవునా “హైవే మార్జిన్ లు సొగసు చూడతరమా” అన్నట్లు ఉంది. ఈరోజు రెండు మిషన్ లు పూర్తిగా మార్జిన్ లోని గడ్డిని శుభ్రం చేశారు. చేసిన పని తదుపరి అందం చెప్పనలవి కాదు చూడవలసిందే.

          6:10 నిమిషాలకు అలుపెరగక శ్రమించిన 23 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే కాఫీ సేవించి తదుపరి సమీక్షలో “దేసు మాధురి” గారి జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి జై కొట్టి,

          రేపు కలవవలసిన ప్రదేశం “శారదా గ్రాండియర్” వద్ద అనుకుని నిష్క్రమించారు.

          చల్లపల్లి వాస్తవ్యులు పల్నాటి మల్లిఖార్జునరావు గారి సతీమణి సుభద్రమ్మ గారి 6 వ వర్ధంతి సందర్భంగా పల్నాటి భాస్కర్, అన్నపూర్ణ దంపతులతో 2,000/- స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం పంపారు.

          స్వచ్ఛ కార్యకర్త ప్రాతూరి శాస్త్రి గారి నెలవారీ చందా 5,000/- చెక్కును స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం డాక్టరు గారు స్వీకరించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  08.09.2025.

ప్రశ్నల పరంపర – 4

బుద్ధిగా ప్రవహించుచుండిన మురుగు కాల్వల నడిగి చూశా,

పంట కాల్వల నడిగి చూశా, బస్సు ప్రాంగణములను అడిగా

ఎలా ఇంతటి శుభ్రతలు అని, ఎందుకింతటి స్వచ్ఛతలు” అని

అన్నిటికి ఒకె సమాధానం – “స్వచ్ఛ సుందర ఉద్యమం” అని!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   08.09.2025.