3586* వ రోజు ....           09-Sep-2025

 ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

09.09.2025 మంగళవారం – 3586* వ రోజు నాటి స్వచ్ఛ సేవల వివరములు!

          తెల్లవారు జాము 4.17 ని.లకు 12 మంది కార్యకర్తలు శారదా గ్రాండియర్ వద్ద కలుసుకుని పనికి సమాయత్తమయ్యారు.

          రోడ్డు క్రింది భాగంలో పెద్ద మొక్కల చుట్టూ కమ్ముకున్న గడ్డి, కలుపు, రెల్లుగడ్డి దుబ్బులను బాగు చేసి, చిన్న పూల మొక్కలకు మాత్రం కంప కట్టడం, వంగిపోకుండా కర్ర కట్టడం చేస్తూ వస్తున్నారు.

          వరికోత సమయంలో పొలాల్లో యంత్రాలు పనిచేస్తున్నట్లుగా స్వచ్ఛ సేవలో వేకువ నుండి రెండు గట్టి కటింగ్ యంత్రాలతో రహదారి క్రింద, పై భాగాలలో చెత్తను ఇద్దరు కార్యకర్తలు ఊపిరాడకుండా కత్తిరిస్తున్నారు.

          క్రమక్రమంగా వచ్చి పని మొదలుపెట్టిన 25 మంది కార్యకర్తల శ్రమతో హైవే రోడ్ లో ఎడమవైపు (బందరు వైపు) చాలా దూరం కార్యకర్తల శ్రమకు గడ్డి కటింగ్ యంత్రాల సామర్ధ్యం తోడయింది.

          ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తున్న మాట మాత్రం పని పూర్తవగానే ఒకసారి వెనుదిరిగి తేరిపార చూస్తే ఆ స్వచ్ఛ శుభ్ర సుందరమయిన ప్రదేశం నిజంగా స్వచ్ఛ కార్యకర్తల స్వేద జలంతో ఆ ప్రాంతమంతా కడిగినట్లనిపిస్తుంది.

          6 గంటల వరకు పనిచేసిన కార్యకర్తలు విజిల్ మ్రోగిన పిదప ఒక చోటికి చేరి కాఫీ సేవిస్తూ పని పాటల కబుర్లతో చెమట తడి ఆరిన తర్వాత సమీక్షలో పాల్గొని “వక్కలగడ్డ రామకృష్ణ” చెప్పిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి జై కొట్టి,

          రేపు కలవవలసిన ప్రదేశం “స్వాగత ద్వారం” ఎదురుగా ఉన్న మెరక ప్రదేశం వద్ద కలుద్దామనుకొని ఇంటి బాట పట్టారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  09.09.2025.

        ప్రశ్నల పరంపర – 5

“వేలకొద్దీ ఊళ్లు ఉండగ - అవి ఘనతలెన్నో కలిగి ఉండగ –

ఏమిటీ నీ ప్రత్యేక”తంటూ చల్లపల్లిని అడిగి చూశా

“ఎచట ఉండని త్యాగమూర్తులు – కష్టజీవులు - కార్యకర్తలు

నాకు ఉండుటె అదృష్టం” అని న్యాయమైన జవాబు విన్నా!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   09.09.2025.