ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
10.09.2025 బుధవారం – 3587* వ రోజు నాటి శ్రమోద్యమ సిత్రాలు!
జాతీయ రహదారిని కలిపే గంగులవారిపాలెం రోడ్ లోని చల్లపల్లి స్వాగత ద్వారం వద్దకు వేకువజాము 4.20 కల్లా చేరుకున్న కార్యకర్తలు 13 మంది.
మొదటి ఫోటో తరువాత పని విభజన చేసుకుని ఎవరికి వారు వారివారి పనిముట్లు చేతబట్టి గ్రామ స్వచ్చతా బాధ్యతను బుజస్కందాలకెత్తుకున్న కార్యకర్తలు కార్యాచరణకు సిద్ధమయ్యారు.
హైవేకు ఎడమ వైపు (బందరు వైపు) మిగిలిపోయిన దిగువ భాగం లోని కలుపు, పిచ్చి మొక్కలు, కాడ ఉన్నా సరే కష్టపడి మొత్తం తొలగించి మొక్కలకు గాలి, వెలుతురు, సూర్యరశ్మి అందే రక్షణా చర్యలు చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
6 గురు కార్యకర్తలు మొక్కలకు రక్షణగా కంప కట్టడం, అవి వంగి పోకుండా కర్ర కట్టడం చేస్తున్నారు. ఒక మొక్క చెట్టు దశ సంతరించుకోవాలంటే ఎన్ని మార్పులో, ఎన్ని ప్రక్రియలో ఎంత కష్టం? కానీ స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు ఈ పదకొండేళ్లలో నాటిన ప్రతి మొక్కనూ కన్నబిడ్డ వలె కంటి రెప్పలా చూడబట్టి ఈరోజు చల్లపల్లి హరిత కాంతులీనుతుంది.
రెండు గడ్డి కటింగ్ యంత్రాలను ప్రతిరోజూ గంటన్నరపైగా నడుముకు వేలాడ దీసుకుని విసుగూ విరామం లేకుండా హైవే రహదారి మార్జిన్లు సమానంగా మెత్తటి పరుపు వలె నైపుణ్యంగా కట్ చేస్తున్న ఇద్దరు కార్యకర్తల శ్రమ కూడా వెలకట్టలేనిది.
స్వాగత ద్వారమునకు అతి సమీపము వరకు పని పూర్తగుట వలన కొద్ది మందికి చేయతగిన పని మాత్రమే ఉందని సమయం వృధా చేయరాదనుకుని,
రేపు ‘శారదా గ్రాండియర్’ దగ్గర ఆగి మధ్యలో నిలిచిపోయిన హైవేకు ఎడమ వైపు (అవనిగడ్డ వైపు) పనిని కొనసాగిద్దమనుకొన్నారు.
6 గంటల సమయం దాటే వరకు సమయ శ్రమను త్యాగం చేసిన 27 మంది సైనికులు కలసి రండి కదలిరండి స్వచ్చ చల్లపల్లికి – శ్రమ శక్తే మూలధనం ఆరోగ్యమె దాని ఫలం అంటూ చేతులు శుభ్రపరుచుకుని కాఫీ సేవిస్తూ సంతోషాన్ని పంచుకుని సమీక్షలో పాల్గొని,
వేల్పూరి లక్ష్మి తక్కువ స్వరంతో పలికిన ‘జై స్వచ్ఛ సుందర చల్లపల్లికి’ బిగ్గరగా జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రాంతం హైవే లో “శారదా గ్రాండియర్” వద్ద అనుకుని తిరుగుపయనమయ్యారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
10.09.2025.
ప్రశ్నల పరంపర – 6
“ఊరు వదలి, వీధి దాటి మగవాళ్లొస్తే వచ్చిరి
చీకటిలో - చినుకులలో సేవలు చేస్తే చేసిరి
మరి మహిళల మాటేమిటి? ఊరి బయట సేవలుగా ఎందులకీ పను?” లనగా
“మా సామాజిక బాధ్యత – మరువలేము”.. అని జవాబు!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
10.09.2025.