పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
11.09.2025 గురువారం 3588* వ రోజు నాటి స్వచ్చోద్యమ నేపధ్యం!
ఈరోజు జాతీయ రహదారిపై ఉన్న ‘శారదా గ్రాండియర్’ వద్ద తెల్లవారుజాము
4:20 నిమిషాలకు 12 మంది కార్యకర్తలు స్వచ్ఛ సేవకు సిద్ధమై ప్రధమ ఘట్టమైన మొదటిఫోటో దిగి పనిముట్లు చేతబట్టి కార్యరంగంలోకి దిగారు.
శారదా గ్రాండియర్ ఎదురుగా అనగా హైవేకు కుడి ప్రక్క (అవనిగడ్డ వైపు) మొక్కలలోని కలుపు, గడ్డి లాగి మొక్కల చుట్టూ చెత్త లేకుండా పాదులలో పరిశుభ్రం చేశారు. అక్కడక్కడా దట్టంగా మొలిచిన రెల్లు గడ్డిని కోయడం రోడ్డు క్రింది భాగంలోని చెత్తను, తుక్కు గడ్డిని, రెల్లుగడ్డిని పైకి వేయగా మహిళా కార్యకర్తలు లాగి గుట్టలుగా పేర్చి లోడింగ్ కు సిద్దం చేశారు.
ముగ్గురు కార్యకర్తల బృందం మొక్కలకు రక్షణగా కంపను పాతి సరిచేసి కట్టడం, వంగిన వాటిని తిన్నగా లాగి సరిచేసి కట్టడం ఎంతో ఓర్పు నేర్పుతో ఆపని చేస్తున్నారు.
మనం ఎక్కడ చూసినా ఒక పని పూర్తి చేసిన ముఠా కార్మికులు కాంట్రాక్టు లేబరు, రోజువారీ కూలీలు పని పూర్తవగానే ఆ సమూహమంతా ఆరోజు పడిన శ్రమకు వచ్చిన ఫలితాన్ని (డబ్బును) పంచుకుని, ఎవరి కష్టం వారు తీసుకుని ఇంటికి వెళతారు.
కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా వేకువనే ఎవరూ పిలవకుండా నిద్ర లేచివచ్చి ఎవరు పనిముట్లు వారు తీసుకుని రెండు గంటలు అందరి కోసం గ్రామ స్వచ్ఛ శుభ్రతలే లక్ష్యంగా రెక్కలు ముక్కలు చేసుకుని ఒక చోట చేరి చేయవలసిన పని గూర్చి సమీక్షించుకుని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సంతోషాన్ని మాత్రమే వారితో తీసుకుని వెళ్ళే ఈ సుదీర్ఘ సమయ శ్రమ త్యాగ జీవులకు ఈ చల్లపల్లి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు.
6 గంటల వరకు శ్రమించిన 26 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే కాఫీ విరామంతో కొద్ది నిముషాల పని సంభాషణలాడి సమీక్షలో ‘పాగోలు ప్రశాంతి’ పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రదేశం ఈ “శారదా గ్రాండియర్” వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
11.09.2025.
ప్రశ్నల పరంపర – 7
అడిగితి నా ఊరి ప్రజలను – “అయ్యలార! పావులక్షజ
నాల ఊళ్లో నలుబదేబది మాత్రమేనా కార్యకర్తలు?”
“ఇంత వేకువలోన కుదరదు - ఇంత మంచులొ జలుబు చేస్తది –
పాలు మాలక - బద్ధకించక వీలు చూసుక వచ్చెదములే!”
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
11.09.2025.