3589* వ రోజు ....           12-Sep-2025

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

12.09.2025 శుక్రవారం - 3589* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన సంగతులు!

          వర్షం రావడానికి సిద్ధమై ఒక మాదిరి వర్షపు చినుకులు ప్రారంభమైన ఈ చినుకులు మా లక్ష్యాన్ని ఏమీ చేయలేవంటూ ఆ సమయంలో అనగా తెల్లవారు జామున 4.12 నిముషాలకు ముందుగా అనుకున్న ప్రదేశమైన శారదా గ్రాండియర్ వద్దకు 12 మంది కార్యకర్తలు చేరుకున్నారు.

          ప్రస్తుతం జాతీయ రహదారి ఇరువైపులా స్వచ్ఛ కార్యకర్తలు చేస్తున్న ఆపరేషన్ మొక్కల పరిరక్షణ. గత 2 సంవత్సరాలలో నాటిన షుమారు 1700 పైగా మొక్కలను కాపాడే క్రమంలో కార్యకర్తలు పడే కష్టం వర్ణనాతీతం.

          ఆ క్రమంలోనే కొంతమంది మొక్క చుట్టూ కలుపు గడ్డి, పిచ్చి కాడ, రెల్లు గడ్డి లాంటి చెత్తా చెదారాల నుండి మొక్కలను రక్షింప చేసే పని, కొంతమంది గాలి నుండి కాపాడే ప్రయత్నంలో కర్ర కట్టి, మొదళ్ళను మట్టితో బలం చేయడం, పశువుల నుండి రక్షణ కై కంప కట్టి పాదు చేయడం లాంటి పనులు ఎంతో క్రమశిక్షణతో చేస్తున్నారు..

          5 గంటల నుండి చిన్నపాటి జల్లు మొదలైనా తడుస్తూనే మహిళా కార్యకర్తలు కూడా చెత్తను లాగి పోగు చేయడం, గొర్రులతో పనికి అడ్డు వచ్చిన కంపను లాగి వారికి వీలు చెయ్యడం ఇలాంటి పని వారికి వెన్నతో పెట్టిన విద్యలా మారింది. ఒకే ఎత్తులో మిషన్ తో గడ్డిని కత్తిరించి చేసిన పనికి అందాలద్ది.... తుది మెరుగులు దిద్దుతున్న మరో కార్యకర్త ఇలా అందరూ గ్రామ సేవలో నైపుణ్యమైన పని వారలే.

          ఆ రహదారి అందాలు చూసి బాగుందనే వారు కొందరు, చెట్ల నీడన నిలబడి బలే మంచి పని అనేవారు ఇంకొందరు, ఇక్కడే కాదు ఊరంతా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేవారు మరికొందరైతే, ఏం లాభం వీరికి లేనిదే ఇదంతా ఎందుకు చేస్తారులే అనుకునే ఉత్త మొద్దురా చిప్పలు నూతిలోని కప్పలు కూడా అతి కొద్దిమంది లేకపోలేదు.

          ఎవరెన్ని అనుకున్నా మా గమ్యం చేరే వరకు లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించమంటున్న సుదీర్ఘ శ్రమజీవులు ఈ రోజు 6 గంటల వరకు చెమటోడ్చి శ్రమించిన 19 మంది విజిల్ మ్రోగగానే ఒకచోట చేరి తడుస్తూనే కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొని డాక్టర్ పద్మావతి మేడం గారు జై స్వచ్ఛ సుందర చల్లపల్లి అంటూ స్ఫూర్తి నింపిన నినాదానికి జేజేలు పలికి రేపు కలవవలసిన  ప్రదేశం శారదా గ్రాండియర్ వద్దనే అనుకుని వెనుతిరిగారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  12.09.2025.

        ప్రశ్నల పరంపర – 8

గురవారెడ్డి - ప్రసాదరెడ్డి తదితర దాతల కూడ అడిగా

“ఉన్న డబ్బును దాచుకొనక ఉద్యమాలకు పంచుటేమని

“ఇంత వ్యసనం తగున మీ”?కని!” “మంచి పనులకు దానమీయని

ధనంతో మాకేమి పని?” అని తగు సమాధానమే వచ్చెను!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   12.09.2025.