2005*వ రోజు....           08-May-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 2005* వ నాటి శ్రమదాన వైభవం.  

          నేటి ప్రాతః సమయ గ్రామ మెరుగుదల ప్రయత్నంలో కూడి వచ్చిన కార్యకర్తలు 28 మంది. శ్రమదాన ప్రాంతాలు – 1) గంగులవారిపాలెం దారి 2) బందరు రహదారి ప్రక్క జమీందారుల వైజయంతం.

          శ్రమశక్తి ప్రదాన సమయం 3.54 – 6.00 కాలాల మధ్య.

          ఇవి గాక, వీధులు, రహదార్ల వెంట వందలాది చెట్లకూ టాంకరుతో నీరందించే పని, కరోనా కట్టడి మెలకువల కోసం 6.45 దాక స్వచ్చోద్యమ గాయక కార్యకర్త వీధి ప్రచారం.

          గంగులవారిపాలెం దారి మలుపులో ప్రైవేటు దిబ్బల శుభ్ర – సుందరీకరణంలో 20 మంది కార్యకర్తల కృషి పరాకాష్టకు చేరిందనే చెప్పాలి. అక్కడి కాలుష్యాల మీద, అసౌకర్యాల మీద, అందవిహీనతల మీద – కత్తులతో, మరరంపంతో, దంతెలతో, చీపుళ్లతో ఈ కార్యకర్తలు జరిపింది యుద్ధమనాలా, చేసింది తపస్సనాలా? 6.00 సమయంలో లక్ష్యం నెరవేరే కాలానికి ప్రతి ఒక్కరి శరీరం లో అలసట, ఒంటి నిండా చెమట - ముఖంలో, కళ్ళలో మాత్రం ఒకానొక సంతృప్తి! ఈ మురికి బట్టల చెమట – అలసటల శ్రమ సంస్కృతే – అదీ తమ లబ్ది కోసం కాక, ఊరి మేలు కోసం – నేటి మన సమాజంలో వ్యాపించాలని నాబోటి వాళ్ళ కోరిక! ఈ స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల నిరంతర సుదీర్ఘ సాధన అందుకోసమే మరి!

          సుందరీకరణ కళాకారులు 3 వారాల వైజయంత కుఢ్య చిత్రీకరణ నేడు కూడ ఆరేడుగురితో కొనసాగింది. బాగా ఎత్తైన ప్రవేశద్వారం ఆర్చి కొంత శిధిలమై ఊడిపోతే – ధర్మోకోల్ తో దాన్ని పూరించి, సహజంగా ఉన్నట్లుగా తీర్చిదిద్ది, రంగులు వేసిన కార్యకర్త సృజనాత్మకతను (వాట్సాప్ లో) గమనించారా? వీళ్ళ సుందరీకరణ యాత్రలో ఇదొక సాధారణ ఉదాహరణ! ఇలాంటివి ప్రత్యక్షంగా చూడాలనుకొంటే ఉదయం 4.00 – 6.30 మధ్య రేపు కూడ నెలకొనే రంగుల అద్దకం పరిశ్రమ – బందరు బాటలోని వైజయంతం దగ్గరకు రండి!

          రేపటి శ్రమదాన సందడి కోసం మనం – 1) బందరు మార్గంలోను, 2) గంగులవారిపాలెం బాటలోని పద్మాభిరామం దగ్గరను ఆగుదాం!

          పాటుబడుతూ పరవశిస్తూ...

తమ సమాజ రుణాన్ని తీర్చే తాత్త్వికతతో స్వచ్చ సైన్యం

బ్రహ్మపెట్టిన ముహూర్తంలో ప్రతి దినం మేల్కాంచి – గ్రామం

అన్ని మూలల కలుషితాలను అంతుజూస్తూ కదలి ఈ పం

దొమ్మిదొందల నాళ్ళ కాలం పాటుబడుతూ నిజంగానే పరవశించింది!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

శుక్రవారం 08/05/2020,
చల్లపల్లి