3590* వ రోజు ....           13-Sep-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

13.09.2025 శనివారం - 3590* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమ సన్నివేశములు!

          జాతీయ రహదారి పై ఉన్న శారదా గ్రాండియర్ వద్ద ఈ రోజు తెల్లవారుజాము 4.15 ని.లకు వచ్చి చేరినది 14 మంది కార్యకర్తలు. వెంటనే పనిముట్లు చేత బట్టి ఆయా పనులను విభజించుకుని రెండు మూడు బృందాలుగా చేరి పనిలో ముందుకు నడిచారు.

          హైవేకు ఎడమ (అవనిగడ్డ) వైపు కొంత భాగం ఇంతకు ముందు చేసిన పనికి కొనసాగింపుగా ఈ రోజు కొంతమంది కార్యకర్తలు రెల్లు గడ్డి, కలుపును తీసుకుంటూ 2 సంవత్సరాల క్రితం మనం నాటిన పూల మొక్కలు, పండ్ల మొక్కలకు రక్షణ కల్పించారు.

          రోడ్డు మార్జిన్ క్రింది భాగం వరకూ చాలా పరిశుభ్రంగా ఉండేటట్లు పనిచేస్తూ ఉన్నారు. మరొక బృందం కార్యకర్తలు బాగు చేయగా వచ్చిన తుక్కు, పనికిరాని ముళ్ళ పొదలను గుట్టలుగా లాగి లోడింగ్ కు సిద్ధం చేసుకుని ట్రాక్టర్లో లోడ్ చేస్తున్నారు.

          మరొక ముగ్గురు కార్యకర్తలు మాత్రం స్వాగత ద్వారం ప్రక్కన మామిడి మొక్కల పాదులలో ఉన్న కలుపును పూర్తిగా ఏరి వేసి శుభ్రం చేశారు. ఒక కార్యకర్త మిషన్ తో మిగిలిన భాగంలోని గడ్డిని సమానంగా కట్ చేశారు.

          6 గంటల వరకు పని చేసిన 31 మంది కార్యకర్తలు పని ముగించుకొని కాఫీ సేవించిన పిదప ఆసుపత్రి సిబ్బంది స్వచ్ఛ కార్యకర్తలలో ఒకరైన పండలనేని శ్రీ కనకదుర్గ పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టి,

          రేపు కలవవలసిన ప్రదేశం ఈ “శారదా గ్రాండియర్” వద్ద అనుకుని నిష్క్రమించారు.    

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  13.09.2025.

        ప్రశ్నల పరంపర – 9

ఎందుకైనా మంచిదని ఆ చెట్టునడిగా – పుట్టనడిగా –

భూమినడిగా - గాలినడిగా - సముద్రాలను అడిగి చూశా

“స్వచ్చ సుందర కార్యకర్తల చర్య సబబా – కాద?” అంటూ

ఏకకంఠంతో అవన్నీ” ఇదే ఉత్తమ” మనుట విన్నా!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   13.09.2025.