పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
14.09.2025 ఆదివారం 3591* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమ యజ్ఞం!
సరిగ్గా తెల్లవారుజాము 4:17 నిమిషాలకు జాతీయ రహదారి ప్రక్కనే గల ‘శారదా గ్రాండియర్’ ఫంక్షన్ హాలు వద్ద ఫ్లడ్ లైటుల వెలుతురులో 13 మంది కార్యకర్తలు వరుస క్రమంలో నిలబడి ప్రధమ ఫోటో దిగుతుంటే ఆ సమయంలో హైవేలో వెళ్ళే ప్రయాణికులు, వాహనదారులు ఒకింత ఆశ్చర్యానికి, సందిగ్దానికి గురౌతున్నారు. ఆలోచిస్తూ ఇదేమిటా ఇంత రాత్రి వేళ అని ప్రశ్నించుకున్నవారికి కొద్ది దూరం వెళ్ళిన తరువాత గోచరిస్తుంది. ఓహో దశాబ్దకాలంగా స్వచ్ఛ ఉద్యమం జరుగుతున్న చల్లపల్లి ఇదేనా అని.
హైవే కు రెండు ప్రక్కలా నాటిన మొక్కల పరిరక్షణే ప్రస్తుతం కొద్ది రోజులుగా చేస్తున్న శ్రమదానం, ఎడమ వైపు మొక్కల చుట్టూ దట్టంగా పెరిగిన గడ్డిని కోయడం, అల్లుకున్న పిచ్చి కాడ తీసివేయడం మొక్కల పెరుగుదలకు స్వేచ్ఛ కలిపించడం ఈ పనులన్నింటిలో అందరూ సిద్ధహస్తులే, అందునా కత్తితో చేసే పరిశుభ్రతా పనులకు ఈ మహిళా కార్యకర్తలు కూడా చేయి తిరిగినవారే.
మరొక బృందం కొద్ది రోజులుగా అక్కడక్కడా లోడింగ్ చెయ్యకుండా వదలవలసి వచ్చిన కొంత తుక్కును, ముళ్ళ కంపను ట్రాక్టర్ లో లోడ్ చేసుకుంటూ మొక్కలకు కంప పాతుకుంటూ, అస్తవ్యస్తంగా పెరిగిన కొమ్మలను కత్తిరించుకుంటూ ఏకకాలంలో పెక్కు స్వచ్ఛతా పనులను చక్కబెడుతున్నారు.
గడ్డి కత్తిరించే యంత్రం పని మామూలే, రోడ్డు మార్జిన్ లను అందంగా తయారుచేసే ఈ పని చేసే కార్యకర్త రావడంతోనే ఆయిల్ నింపుకుని మిషన్ స్టార్ట్ చేసి నడుముకు తగిలిస్తే మరలా దించేది 6 గంటల సమయం అయిన తరువాతే.
“తాజ్ మహల్ నిర్మాణానికి – రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు” అనినట్లు ఇప్పుడు రాబోయే కాలంలో చల్లపల్లి నాల్గు చెరుగులా ఈ స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ ఫలాలు అనుభవించే వారికి, ఆస్వాదించే వారికి పైన పేర్కొన్న వారి శ్రమ, ఉద్యమ చరిత్ర తెలియాలంటే, ప్రజా ప్రతినిధులూ, ఉపాధ్యాయులూ, స్వచ్చంద సంస్ధలూ, సామాజిక వాదులూ, మానవతా వాదులూ, ఆధ్యాత్మిక వాదులూ, ప్రభుత్వ యంత్రాంగం కూడా స్వచ్ఛ ఉద్యమ ప్రస్థానం – జరిగిన మౌలిక మార్పుల గురించి వారి వారి దైనందిన సభలు – సమావేశాలలో తప్పనిసరిగా ప్రస్తావించాలి.
6 గంటల సమయం దాటే వరకూ పనిచేసిన 23 మంది కార్యకర్తలూ పని ముగించుకుని సామాగ్రి వాహనాల మకాం ప్రదేశానికి చేరుకుని కాఫీ సేవిస్తూ వారి పని పాటల సంతోషాల సరదా ముచ్చట్లతో ఐదు నిమిషాలు సేద తీరి సమీక్షలో పాల్గొన్నారు.
ఆసుపత్రి సిబ్బందిలో ఒకరైన స్వచ్ఛ కార్యకర్త ‘భోగాది సూర్య ప్రకాశరావు’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టి,
రామానగరం వాస్తవ్యులు మిలట్రీ శ్రీనివాసరావు గారు స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం 500/- రూపాయలను స్వచ్ఛ కార్యకర్త లక్ష్మణరావు గారి ద్వారా పంపారు.
రేపు కలవవలసిన ప్రదేశం ఇదే ‘శారదా గ్రాండియర్’ వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
14.09.2025.
ప్రశ్నల పరంపర – 10
నిద్రలేచిన మొదలు పుట్టిన ప్రాంత వృద్ధిని కలవరించే –
పిల్లల చదువుకు సహకరించే - అందుకోసం అప్పుచేసే
వ్యసని – మండవ శేషగిరికొక ప్రశ్న వేశా – “ఇంత వెర్రా?
పరోపకృతి కొక హద్దు వద్దా....?” వచ్చెనెట్లని సమాధానం –
“మనం చేసే మంచి పని మన మనుగడకు శ్రీరామరక్షే”!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
14.09.2025.