2007* వ రోజు ....           10-May-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – (200..)7* వ నాటి శ్రమ జీవన విలాసం.

 

          ఈ ఆదివారం కూడ స్వచ్చోద్యమ కారులకు అంతకు ముందే తెల్లవారి, 3.58 నుండే తమ గ్రామ కర్తవ్యం మొదలై -6.15 దాక కొనసాగింది.  నేటి ఉద్యమకారుల సంఖ్య 40. నాలుగైదు నెలలుగా ఈ శుభోదయ శ్రమదానానికి (సకుటుంబ అనారోగ్య కారణంతో) రాలేని సీనియర్ (79) కార్యకార్త రావెళ్ల శివరామ కృష్ణయ్య గారు , లవ్లీ కార్యకర్త సాయంతో 4 కిలో మీటర్ల దూరంలోని తన శివరామపురం నుండి హాజరయ్యారు.

 

గంగులవారిపాలెం బాట సగాన్ని ఆక్రమించి, స్వచ్చ, శుభ్ర-సుందరీకరించిన కార్యకర్తలే 32 మంది. మిగిలిపోయిన రెండు మూడు తాడి చెట్లను నున్నగా చెక్కి, సుందరీకరించిన నలుగురు , నిన్నా- మొన్నా ఎక్కడైనా తప్పించుకొన్న చెత్తను, ఖాళీ సారా సీసాలను ప్లాస్టిక్ సంచుల్ని, గడ్డిని, పిచ్చి మొక్కల్ని, రోడ్డు మీది ఎండు వరి గడ్డిని, కసవును... ఊడ్చి, ఏరి, నరికి, దంతెలతో లాగి, డిప్పలతో ఎత్తి, ట్రస్టుకు చెందిన ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి చేర్చిన 20 మంది, పద్మాభిరామం పరిసరాలను మరింత స్వచ్చ సుందరీకరించిన పది మంది శ్రమ జీవులు అభినందనీయులు. మరి ఈ పదిహేను  రోజుల శ్రమ పూర్వక- స్వేద కారక- కృషి ఫలితాన్ని ఆస్వాదించే ఈ గంగులవారి పాలెం దారిలోని సాయి నగర్ – భవఘ్నినగర్  నివాసితుల సంగతేమిటి? కేవలం ఈ కార్యకర్తల కఠోర శ్రమ ఫలితాన్ని మాట వరసకు అభినందిస్తారా?  ధన్యవాదాలు తెలుపరా? పాల్గొనరా? కొన్నాళ్లు కొద్ది మంది పాల్గొన్నారు. ఇన్ని రోజుల- ఇన్ని వందల పని గంటల- ఈ కార్యకర్తల శ్రమ ఎవరి కోసం? ఎందు కోసం?

 

బందరు జాతీయ రహదారి ప్రక్కన గల జమీందారుల వైజయంతం ప్రహరీల- ద్వారాల-బురుజుల వర్ణ రంజిత స్వచ్చ సుందరీకరణం ఈ నాడు కూడ కొనసాగింది గాని, నేను పూర్తిగా గమనించలేకపోయాను. డాక్టర్ డి. ఆర్. కె  గారి , శంకర శాస్త్రి గారి వాట్సాప్ ఛాయా చిత్రాల నుండి ఆ చిత్ర కళా వైభవాన్ని మీరు గమనించండి.

 

డంపింగ్ యార్డు దగ్గర తాము పండించిన- రసాయన ఎరువు వాడని, పురుగు మందులు తగలని ఆరోగ్యకరమైన కూర అరటికాయలను ట్రస్టు ఉద్యోగులు తెచ్చి పంచారు.

 

కాఫీ ఆస్వాదనా సమయంలోనే – మాస్కులతో జాగరూకులైన కార్యకర్తలు ఒకరికొకరు దూరం పాటిస్తుండగా డాక్టరు గారు నేటి స్వచ్చంద శ్రమ దాన రీతిని విశ్లేషించి, సమీక్షించి, ప్రశంసించారు.

 

“ రేపటి మన ఐచ్చిక శ్రమదాన వేదిక- పాగోలు గ్రామానికి చెందిన దారి” అని కూడ ప్రకటించారు.  

          ద్వి సహస్ర దినాల దీక్ష...

సామాన్య శ్రమ జీవికి సైనికుడను బిరుదులేల?

ఇంత చిన్న బాధ్యతలకు సేవలనే పేరులేల?

నిజాయితీ ముందు నడిచి - నిస్వార్థత చేయి బట్టి

ద్వి సహస్ర దినాల దీక్ష తేజరిల్లి నందులకా!

 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

శనివారం – 10/05/2020,
చల్లపల్లి
.

3.05 నిముషాలకు గంగులవారి పాలెం రోడ్డు వద్ద