2008*వ రోజు....           11-May-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – (200..)8* వ నాటి పొరుగు గ్రామ సేవలు 

            స్వచ్చ చల్లపల్లి కార్యకర్తల శ్రమదాన కార్యక్రమం ఎప్పటిలాగే వేకువ 4.02 కే మొదలై, 6.05 నిముషాల దాక నిరాటంకంగా, సక్రమంగా, సందడిగా సాగిపోయింది. వీరు బాధ్యతలు నిర్వహించిన జాగాలు

1) బందరు జాతీయ రహదారి మీద ఉత్తరంగా ఉన్న వైజయంతము

2) పొరుగు గ్రామమైన పాగోలు మార్గము.

            శ్రమదాతలు మొత్తం 31 మంది, వీరితో బాటు ట్రస్టు ఉద్యోగులు కొందరు ఇదే సమయంలో తమ విధులు నిర్వర్తించారు.

            పాగోలు దారిలో అపార్ట్మెంట్ల సమీపంలో ఆగిన 22 మంది కార్యకర్తలు కొందరికి నాలుగున్నరేళ్ళ క్రితం తాము శుభ్రపరచిన అచ్చటి మినీ డంపింగ్ ను, బహిరంగ మల మూత్ర విసర్జన భీభత్సాలను గుర్తు చేసుకున్నారు. తమ శ్రమ దీక్ష తోను, కాలమహిమతోను చల్లపల్లే గాక పాగోలు కూడ O.D.F (బాహ్య మల విసర్జన రహిత) గ్రామాలు గా మారిన వైనం కూడ తలచుకొని సంతోషించి ఉంటారు!     

            నెలలతరబడి జరిగిన 1 ½ కిలో మీటర్ల ఈ రోడ్డు స్వచ్చ శుభ్ర హరిత సుందరీకరణ కోసం తపించిన తన డబ్బును చాలా వెచ్చించిన కంఠంనేని రామబ్రహ్మ్మం గారితో బాటు తన పాగోలు పాఠశాల విద్యార్ధుల (అప్పుడే నేర్చుకొంటున్న) డప్పు మ్రోతలతో సందడి చేయించిన యోగా నారంశెట్టి వేంకటేశ్వరరావు గారు నాకు గుర్తు వచ్చారు.

            అప్పట్లో అప్పుడప్పుడైనా తమ పరిసరాల స్వచ్చ శుభ్ర ప్రయత్నం లో మనతో కలిసిన అపార్ట్మెంట్ల వారు ఈ రోజు మాత్రం ససేమిరా రాలేదు! మన 20 మంది కార్యకర్తలే అవనిగడ్డ దారి మొదలు అపార్ట్మెంట్ల దాక రెండు ప్రక్కల గడ్డిని, పిచ్చి మొక్కల్ని, చెట్లకు తగిలి వికారంగా వ్రేలాడుతున్న వరి గడ్డి పరకలనూ, రకరకాల ప్లాస్టిక్ తుక్కునూ, పొట్లాలను, ఎంగిలి విస్తర్లనూ ఊడ్చి, ఏరి నరికి దంతెలతో గుట్టలుగా లాగి , డిప్పలతో ట్రస్టు ట్రాక్టర్ లో కెత్తి, డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ రెండు గంటల పాటు జరిపిన కృషితో ఆ సిమెంటు దారంతా అందంగా, సౌకర్యంగా, ఆహ్లాదకరంగా మారింది. (సమీప గృహస్ధుల ఉదాసీనత ఒక్కటే దీనికి భిన్నంగా ఉంది!)

            6.20 కి నేను తిరిగి ఇంటికి వచ్చే సమయానికి బందరు దారిలోని వైజయంతం రెండవ గోడ మీద (మనుషులు మారాలిసినిమా లో శ్రీ శ్రీ వర్ణించినట్లు -) తూరుపు సింధూరపు బంగారపు వన్నెలలో - స్వచ్చ కళాకారుల హృదయ గానం వినిపించింది. ఈ తూర్పు ప్రహరీ బహుశా మన సుందరీకర్తలకు మరి నాల్గు రోజులకు సరిపడా పని కల్పించవచ్చు.

            ఇదే నేటి మన కార్యకర్తల సుందరీకరణ యజ్ఞం, స్వచ్చ శుభ్ర తపోవిశేషం!

            రేపటి మన గ్రామ మెరుగుదల సమయాలలో గాని, ప్రాంతాలలో గాని మార్పు లేదు.

     25000 మంది v 100 మంది!

స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టదనిన....

సామాజిక ఋణం తీర్చ సాహసమే పునాదిగా ...

పాతిక వేల జనాభా పైనే గల గ్రామస్తుల

స్వస్తకకై వంద మంది సమరం సాగించడం! 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

సోమవారం 11/05/2020,

చల్లపల్లి.