2015*వ రోజు....           18-May-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం : 20 – 15* వ నాటి ఆహ్లాదం.

            నేటి వేకువ జామున 4.00 – 6.00 సమయాల నడుమ – (35+7+2) 44 మంది కర్తవ్య పరాయణుల శ్రమ – స్వేదంతో పునీతమైన పాగోలు రోడ్డుకు, 7 రోజుల క్రిందటి ఈ దారికి చాల వ్యత్యాసం ఉన్నది. వీరబ్రహ్మేంద్రుని నిలయం దగ్గరి వంతెన దగ్గర కొందరు, సమీప గృహ సముదాయం దగ్గర ఆరుగురు, చందమామ దగ్గర 8 మంది, మహాబోధి పాఠశాల ముఖద్వారం కడ మిగిలిన 15 మంది చేసిన, చేస్తున్న వినయపూర్వక శ్రమదానంతో ఈ పాగోలు మార్గమే కాదు – ఏ బాటకైనా స్వచ్చ – శుభ్రతలు వస్తాయి, కొత్త అందాలు రావా మరి? చిత్త శుద్ధితో ఒక సమూహంగా చేసే కృషికి ఫలితం ఇలాగే వస్తుంది!

            ఇవాల్టి శ్రమదాతలైన కార్యకర్తల్లో 80 ఏళ్ల వృద్ధులుండవచ్చు, లోకం తెలియని 8 – 10 ఏళ్ల పిల్లలుండవచ్చు – కాని, ఈ రెండు గంటల పాటు వీళ్ళందరిదీ ఒకే దీక్ష – ఒక గమ్యం – ఈ చల్లపల్లి – పాగోలు మార్గం మరింత స్వచ్చ – శుభ్ర – సుందరంగా కనిపించాలని! అక్కడి నివాసితులే ఈ మురుగు – తుక్కు – ఖాళీ ప్లాస్టిక్ సంచుల – మద్యం సీసాల కాలుష్యానికి కారకులా అని గాని, బాధ్యత గల పంచాయతీ దీన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నది గాని, ఈ ఉభయుల్లో ఒక్కరైనా ఈ శ్రమదాన కర్తవ్యానికి రాలేదేమని గాని, తప్పులెన్నని స్వచ్చ కార్యకర్తల గ్రామ మెరుగుదల తపన, ఈ నిష్కామ కర్మ వర్తమాన సమాజానికి ఆదర్శం! మరి, అదే గదా – గాంధీజీ ప్రవచిత మార్గం!

            కల్వర్టుకు అందమైన రంగులు వేసిన సుందరీకర్తల ప్రయత్నం, గడ్డి వాముల దగ్గరి మురుగు గట్ల అశుభ్రతల – కాలుష్యాల నిర్మూలన కోసం కార్యకర్తల ప్రయత్నం, నిన్న సాయంత్రమే ట్రస్టు ఉద్యోగులు సేకరించి, చేర్చిన ముళ్ల మండల్ని క్రమబద్ధం చేసి, గతంలో తామే నాటి పెంచిన మొక్కలకు రక్షణగా అమర్చి కట్టిన కార్యకర్తల ఆనందం, పాఠశాల దగ్గర రోడ్డు వార గడ్డి కోసి, పిచ్చి – ముళ్ళ మొక్కల్ని తొలగించిన పాగోలు కార్యకర్తల పట్టుదల – అన్నీ ఈ నాటి స్వచ్చ – సుందర – ఉభయ గ్రామాల రూపకల్పనలో భాగాలు!

            ట్రస్టు ఉద్యోగులు విడిగా మరొక రోడ్డును శుభ్ర పరుస్తుంటే, నీళ్ళ టాంకర్ వాళ్ళు 2 గంటల పాటు చాల మొక్కలకు నీళ్లందించారు.

            యశోదానందన్ వ్యాపారి, గోళ్ళ వేంకటరత్నం నేటి ఆదర్శ కృషిని కొనియాడి, ముమ్మారు ప్రకటించిన స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలతో ఈ నాటికి మన గ్రామ బాధ్యతల ముగింపు.

            నిమ్మగడ్డ నివాసి, ప్రస్తుత అమెరికా వాసి – మాలెంపాటి నరసయ్య గారి మనకోసం మనం ట్రస్టుకు 20,000/- విరాళానికి కార్యకర్తలు హర్షం వెలిబుచ్చారు.

            రేపటి మన శ్రమదాన కేంద్రం ఈ పాగోలు మార్గమే!

          ఇవా లెక్కలు – సమీకరణలు?

శతాధికులగు కార్యకర్తల స్వంతమా స్వచ్చోద్యమం?

జనం నడతను గ్రామ భవితను చక్కదిద్దే ఒక ప్రయత్నం

పావు లక్ష జనాభ బాధ్యత వందమందికి పరిమితం!

ఇవేమి లెక్కలు – సమీకరణలు – ఏల ఈ అవకాశవాదం!

 - నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

సోమవారం 18/05/2020,

చల్లపల్లి.