ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1866* వ నాటి విశేషాలు.
నిన్నటి నిర్ణయం ప్రకారం బందరు మార్గంలో మునసబు గారి వీధి మొదలుకొని రాజ్యలక్ష్మి హాస్పిటల్ వీధి వరకు జరిగిన స్వచ్ఛంద శ్రమదానంలో నిన్నటి వలెనే 23 మంది స్వచ్ఛ కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్యోదయ - సూర్యాస్తమయాల వలెనే వీరి గ్రామ కర్తవ్య పరిపూర్తిలో మార్పులు ఉండవు కాబోలు! ఉదయమున5 గంటల నుండి 6.30 దాక ఈ కార్యకర్తల శ్రమజీవన విశేషాన్ని ఈ బందరు మార్గం చూడగలిగింది.
అధిక భాగం కార్యకర్తలు చీపుళ్ళతో ఈ మార్గం ఉభయ - ఉత్తర దక్షిణ అంచులలో కష్టంగానూ మిగిలిన దారిని సులభంగానూ ఊడ్చి - అవసరమైన చోట గోకుడుపారలతో చెక్కి ఆ దుమ్మును మట్టిని ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలను పోగులు చేసి ట్రస్టు యొక్క ట్రాక్టర్ లో నింపి చెత్త కేంద్రానికి చేర్చారు. ముక్కులకు చిక్కాలు బిగించుకొని వీరు చలిలో మంచులో సేకరించిన సదరు వ్యర్ధాలలో హోటళ్ల టీకప్పులు కాగితాలు వంటివెన్నో ఉండటం క్రొత్త కాదు గదా!
ఈనాటి 23 మంది స్వచ్ఛ శ్రామికులు కాక మరొక 40 మంది స్వచ్ఛ సైనికులు చల్లపల్లి స్వచ్ఛ పతాకాన్ని విశాఖ నగర వీధులలో ఎగురవేసి స్వచ్ఛ సుందర చల్లపల్లి నినాదాలను అక్కడి ప్రజలకు వినిపోస్తూనే ఉన్నారు. నేటి సాయంత్రం5 గంటలకు ప్రారంభమయ్యే తోటకూర ప్రసాదు గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడే బహుమతి స్వీకరణ సమావేశంలో పాల్గొనవలసి ఉన్నది.
ఈనాటి తేనీటి సేవనానంతర సమీక్షా సమావేశంలో బాణావత్తు రమేష్ (స్నేహ మెడికల్స్ ఉద్యోగి) ముమ్మారు స్వచ్చోద్యమ చల్లపల్లి సంకల్ప నినాదాలను ఎలుగెత్తి ప్రకటించి 6.45 నిమిషాలకు నేటి కర్తవ్య దీక్షను విరమించడమైనది.
రేపటి మన స్వచ్ఛ గ్రామ సంకల్పాన్ని డా. రాజ్యలక్ష్మి వీధి దగ్గర కలుసుకుని అమలుచేద్దాం. బహుశా అప్పటికి విశాఖ యాత్రకు వెళ్లిన స్వచ్ఛ చల్లపల్లి సోదర కార్యకర్తలు మనతో కలవవచ్చు.
స్వచ్ఛ సుందర కార్యకర్తలు
శనివారం - 21.12.2019
చల్లపల్లి