పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.
సన్నపాటి వానలోనే 3861* వ విడత శ్రమదానం!
అది 11.6.26 - గురువారం వేకువ 4:21 – 6:05 మధ్య జరిగినది; జరిపిన కార్యకర్తలు Just 23 మంది: మొదటి అరగంట తప్ప చినుకులు ఆసాంతం కార్యకర్తల్ని పరామర్శిస్తూనే ఉన్నవి. 6:00 కు విజిలు మ్రోగి, 6:05 కు పని విరమించాక వర్ష సాంద్రత పెరిగింది.
ఇక ఆ వానలోనే 6.15 కు RTC వాహన చోదక కార్యకర్త నాగేశ్వరరావు చెప్పిన నినాదాలను అందరూ బలపరిచారు. తోట వారేమో బస్ డ్రైవర్ కోణం నుండి చూసి, ఈ నాగాయలంక రోడ్డు అంచుల బరంతులతోనూ, గుంటల పూడికతోనూ వాహన ప్రమాదాల్ని తప్పిస్తున్నందుకు స్వచ్ఛ ఉద్యమకారులకు ధన్యవాదాలు చెప్పారు!
- ఆ తరువాత డాక్టర్ డి.ఆర్.కె. గారి ఆనందం మామూలే! పాగోలు రోడ్డులోని గద్దగోరు చెట్లు ఒరిగినది తప్ప చెట్లన్నీ క్షేమంగా ఉన్నందుకు ఆ సంతోషం! డ్రైన్ల మధ్య పిల్లర్లు పెట్టి మురుగునడ్డుకొంటున్నందుకు ఆయన బాధ! సరే – ఏం చేస్తాం – బాధ్యతల్నుండి తప్పుకున్న సంబంధిత వ్యవస్థలు నిర్వీర్యమైపోతుంటే - ముందుముందు ఏముప్పులొస్తాయో చూస్తుందాం!
ఈ పూట శ్రమదాన విశేషాల విషయానికొస్తే -
- అధిక భాగం కార్యకర్తలు సింహభాగం సమయాన్ని కోళ్ల ఫారాల ప్రవేశం కేంద్రంగానే కష్టించారు. ఐతే - నిన్నా, మొన్నా నిండినంతగా చెత్త ట్రాక్టర్ లో నిండలేదు.
- అందుకు కారణం ఆ గద్దగోరు చెట్ల ముళ్ళకొమ్మలూ, బోగన్ విలియా, ఇంకా ఇతర పిచ్చి తీగలూ పగలు షెడ్డర్లో నుగ్గు చేసేందుకు అక్కడే వదిలేయడమే!
- రోడ్డుకు తూర్పున, థర్మోకోల్ షీట్ల మిల్లు ఉత్తరాన క్రొత్తగా వేస్తున్న వెంచర్ దగ్గర ముగ్గుర్నలుగురు శ్రమించడం ఒక విశేషం!
అందులో డాక్టర్ గారూ, నేనూ పైపై పని వాళ్లం, ఆకుల దుర్గా మరియు భోగాది వాసులదే కష్టమంతా!
“అరె! ఈ వానలో తడుస్తూ, వాహన వేగాల్ని కాచుకొంటూ ఊరికి దూరంగా ఈ చీకటిలో ఈ స్వచ్ఛ కార్యకర్తల కంచిగరుడ సేవలేమిటిరా నాయనా!” అని నాకనిపించింది ! స్థిత ప్రజ్ఞతో - నిర్వికారంగా వేల రోజులు - లక్షల పనిగంటలు శ్రమించే కార్యకర్తలకలాంటిదేమి లేదు!
ఈ పూట స్వచ్ఛోద్యమ ఖర్చుల నిమిత్తం కోడూరు వెంకటేశ్వరరావు గారి 520/-
రేపటి మన శ్రమదానమందుకొనేది కూడ నాగాయలంక రహదారే!
బరువైన పనులె
మెకానిక్కు రవి అంటే మరీ లేత కార్యకర్త
అప్పుడప్పుడొస్తేనేం - అన్నీ బరువైన పనులె
పని మధ్యలొ మానేయక - బండ పనులు వదిలేయక
నిశ్చలముగ పనిచేసే నిక్కమైన కార్యకర్త!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
11.06.2026