ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.
2028* వ నాటి శ్రమదాన చర్యలు.
ఈ నాటి ఆదివారపు ఉక్కపోస్తున్న వేకువలో మెజారిటీ గ్రామస్తులు గాలి నియంత్రణ (A/C) ల - వాయుపంఖా (ఫోన్) ల - రక్షణలో సుఖ నిద్ర చెందే సమయాన – ఖచ్చితమైన సమయ నియమానుసారం – గత నిర్ణయానుసారం 42 మంది స్వచ్చోద్యమకారులు నడకుదురు మార్గంలోని కోమలానగర్ ప్రధాన వీధిలో (4.00 – 6.10 మధ్య) రెండు గంటల పాటు ప్రజోపయుక్త శ్రమదాన విన్యాసాలు ప్రదర్శించారు. ఈ కార్యకర్తలలో 90 ఏళ్ల – రిటైర్డ్ PET నుండి 9 – 10 ఏళ్ల (ఈ రోజు నినాదాలు ప్రకటించిన) యువ తేజ్ వరకు ఉన్నారు. లయన్స్ సేవాపరులు, ధ్యాన మండలి వారు ఉన్నారు.
సుందరీకరణల – గ్రామ రక్షణల టీములున్నీ ఏకోన్ముఖంగా పనిచేయడంతో – అర కిలోమీటరు పర్యంతం ఆ సిమెంటు రోడ్డు ఇప్పుడు కోమలానగర్ పేరును సార్ధకం చేస్తున్నది. ఇంత మండు వేసవి ఉక్క పోతల నడుమ గొస పెడుతూ – నీళ్ళు మాటిమాటికీ త్రాగుతూ – గ్రామప్రయోజనమే స్వకార్యంగా మార్చుకొని – ఒక వార్డులో ఒక వీధిని గజం – గజం చొప్పున ఊడ్చి, పిచ్చి మొక్కలుంటే నరికి, ప్లాస్టిక్ సంచులు, ఖాళీ మద్యం సీసాలుంటే ఏరి, తాము ముందనుకొన్నట్లుగా రోడ్డునే కాక ప్రక్క ఖాళీ స్తలాల్లో అడ్డ దిడ్డంగా చిక్కు పడి పెరిగిన నానాజాతి కంగాళీ చెట్లను, తీగల్ని కత్తి – గొర్రులతో చీకట్లోనే లాగి పోగులు పెట్టి – తెల్లారే సమయానికి ఈ తుక్కులన్నిటినీ ట్రస్టు కు చెందిన ట్రాక్టర్ లో నింపి, డంపింగ్ కేంద్రానికి చేర్చిన ఈ కార్యకర్తల దీక్షను గమనించి .....
“ఎవరిది ఈ పుణ్యమంటు – వెర్రి గాలి ప్రశ్నిస్తూ వెళిపోయింది –
నాకేం సంబంధమంటు ఏమీ అనలేదు కుక్క –
ఒక ఈగను పట్టేందుకు – తొందరగా పోయె తొండ ...(శ్రీ శ్రీ)
ఒకప్పటి తన సహచర కార్యకర్తల శ్రమ సందడిని – ఆరోగ్యం ఏ మాత్రం బాగు లేకున్నా – చూడకుండ ఆగలేక – 80 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు రావూరి సూర్యప్రకాశరావు గారు అరగంట సేపు వీక్షించారు!
మైకు నుండి వినిపించే చైతన్యదాయక గీతాలు వింటూ – “కర్మణ్యే వాధికారస్తే – మాఫలేషుకదాచన ...” అనే గీతా ప్రవచనాన్ని ఆచరణలో ఋజువు చేస్తూ – దూషణ భూషణ తిరస్కార పురస్కారాలకు అతీతంగా ఈ 40 మంది విభిన్న నేపధ్యాల – (పేరెత్త గూడదు గాని) ఎన్నో సామాజిక వర్గాల కార్యకర్తల కలివిడినీ, గ్రామ చక్కదనాల సాధనా ప్రయత్నాలనూ, ఉత్సాహ ఉద్వేగాలనూ చూస్తుంటే – ముఖ్యంగా పాతకాలపు ఆలోచనా పరులైన నా వంటి వారికి ఆశ్చర్యచకితులు కాక తప్పదు! కాకపోతే – ఊళ్ళో కాస్త జ్ఞానవంతమైన నివాస ప్రాంతమనుకొంటున్న ఈ నాటి శుభ్ర సుందరీకృత వీధిలో పట్టుమని పదిమందైనా వచ్చి స్వచ్చంద శ్రమదానంలో ఎందుకు చేరలేదో – రేపైనా చేతులు కలుపు తారేమో ఆలోచించాలి!
ఈ శ్రమదాన సమైక్యతతో తప్ప – విడిగా ఉంటే నడుము విరిగి, బాగైన 60 ఏళ్ల రైతు ట్రాక్టర్ పైకెక్కి చెత్త లోడింగ్ చేస్తాడా? మరొక అర్ధంతర విశ్రాంత (BSNL) ఉద్యోగి ఈ శ్రమదాన విన్యాస వీర విహారం చేసేవాడా? కనుక ఎప్పటికీ ఈ నిస్వార్ధ గ్రామాభ్యుదయకర స్వచ్చోద్యమ ప్రస్థానం వర్ధిల్లుగాక!
కాఫీ – తేనీటి ఆస్వాదన వేళ రకరకాల ఆట విడుపు (స్వచ్చ – శుభ్ర – సంబంధిత) కబుర్ల పిదప సమీక్షా సమావేశ నిర్వాహకుడైన దాసరి డాక్టరు గారు రోజుటి లాగే తన నిర్భర సంతృప్తిని వెలిబుచ్చారు.
గోళ్ళ వేంకటరత్నం గారి మనుమడు – గుంటూరు వాడు - యువ తేజ్ ముమ్మారు ఈ ఊరి మహర్దశా సంకల్ప నినాదాలను వినిపించాడు.
రేపటి శ్రమదాన కేంద్రం కూడ ఈ కోమలానగర్ ముఖ్య వీధే!
సుసంకల్పానికి ప్రణామం
అబలలెవ్వరు – సబలు లెవ్వరు – వృద్ధులైనను పిన్నలైనను
స్వచ్చ ఉద్యమ వీరులందరు – గ్రామ భవితకు బద్ధులందరు
ఐకమత్యం – ఏక లక్ష్యం – అదే స్వచ్చోద్యమ విలాసం
చెక్కు చెదరని – మొక్కవోవని సుసంకల్పానికి నా ప్రణామం!
- నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు ‘మనకోసం మనం’ ట్రస్టు బాధ్యులు,
ఆదివారం – 31/05/2020,
చల్లపల్లి.