ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1867* వ నాటి కృతార్థత.
ఈ నాటి శుభోదయాన కూడ 5.00-6.30 మధ్య జరిగిన గ్రామ స్వచ్చ –శుభ్ర-సుందరీకరణ కై శ్రమించిన వారు 23 మందే. డాక్టర్ రాజ్యలక్ష్మి ఆసుపత్రి వీధి నుండి వీరి పట్టుదలతో ½ కిలోమీటరు పర్యంతం బందరు దారి గ్రామ ప్రధాన కేంద్రం వరకు ఇప్పుడు దర్శనీయంగా మారింది.
సీనియర్ స్వచ్చ కార్యకర్తల్లో సింహా భాగం విశాఖ నగరం లో అక్కినేని నాగేశ్వర రావు అమెరికా ఫౌండేషన్ వారి సేవా రత్న పురస్కారం స్వీకరణకై వెళ్ళినా, ఇతర కార్యకర్తలు – ముఖ్యంగా ధ్యాన మండలి వారు గత మూడు రోజులు చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని నిరాటంకంగా కొనసాగించడం అభినందనీయం. ఈ స్ఫూర్తిని సోదర గ్రామస్తులు కూడ అంది పుచ్చుకొనడం అభిలషణీయం! ఈ నిస్వార్ధ శ్రమదానం గ్రామం మొత్తానికి చెందుతున్నప్పుడు వీలైన మరికొందరు ఈ కార్యకర్తలతో చేతులు కలపడం కానే కాదు అభ్యంతరకరం!
ఈ నాటి 23 మంది స్వచ్చ శ్రామికులు బందరు దారిని సువిశాల-శుభ్ర-స్వచ్చ తరం చేయడానికి చీపుళ్లతో ఊడ్చి, అన్నీ రకాల కాగితాలు-ప్లాస్టిక్ పూల-టిఫిన్ పోట్లాల వ్యర్ధాలను, దుమ్మును, మట్టిని-ఇసుకను ఏరి ఊడ్చి-గోకి- ట్రస్టు ట్రాక్టర్ లో నింపి , డంపింగ్ కేంద్రానికి చేర్చారు. ట్రస్టు కార్మిక సోదరులు కూడ ఇంకా వేసవి రాకున్నా దశ సహస్ర వివిధ వృక్షాలకు- పూల మొక్కలకు నీరందించారు.
సీనియర్ కార్యకర్త లక్ష్మణ రావు ఆచరణ పూర్వకంగా చెప్పిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను కార్యకర్తలంతా పునరుద్ఘోషించి, 6.45 కు తమకు ప్రీతిపాత్రమైన గ్రామ దీక్షను విరమించారు.
మన 40 మందివిశాఖ యాత్రికులు శంకర శాస్త్రి గారి దర్శకత్వంలో బొర్రా గుహలు వీక్షించారు; అరకు అందాలు తిలకించారు; గిరిజనుల ధింసా నృత్యంలో పాల్గొన్నారు; మ్యూజియంలు చూశారు; ఋషి కొండను- సముద్రాన్ని గమనించి, కైలాస గిరి ని కూడ ఎక్కి శనివారం సాయంత్రం మన ట్రస్టు ఛైర్మన్ గురవారెడ్డి గారితో కలిసి, చెన్నమనేని విద్యాసాగర్ రావు గారి నుండి సేవా రత్న పురస్కారం గ్రహించారు; ఒక విధంగా ఆ స్టేజి మీద గాని, ప్రేక్షకుల మధ్య గాని, క్రమ శిక్షణలో గాని, సంఖ్యలో గాని ...... అన్ని విధాల మనమే ప్రధాన ఆకర్షణ.
రేపటి మన గ్రామ విద్యుక్త ధర్మం కోసం గ్రామ ప్రధాన కూడలిలో కలుసుకొందాం.
అనన్యసాధ్యం.
అనితర సాధ్యం బహుశా స్వచ్చ సైన్య నిత్య సేవ
అనన్య సాధ్యం కూడా ఆ సుదీర్ఘ గ్రామసేవ
కాల పరీక్షకు నిలిచి-క్రమ శిక్షణ చాటి చెప్పి
చల్లపల్లి స్వచ్చ సైన్య చలన శీలమైన త్రోవ!
నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
శనివారం – 22/12/2019
చల్లపల్లి.