2029* వ రోజు....           01-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2029* వ నాటి పనితనాలు.

 

          నిన్నటి నిర్ణయానుసారంగా - గత దినం శేషించిన కోమలా నగర ప్రధాన వీధి స్వచ్చ - శుభ్రతా ప్రయత్నం కోసం ఆ సిమెంటు రోడ్డు కొస దాక చేరి, నాల్గు రోడ్ల కూడలి ప్రక్క ఖాళీ మెరక దిబ్బ మీద వాహనాలను నిలిపి, 28 మంది స్వచ్చ కార్యకర్తలు తమకు నచ్చిన విధంగా పరిసరాల పరిశుభ్రత నిర్వహించారు. 4.05-6.05 సమయాల నడుమ 2 గంటలు సాగిన వీరి కర్తవ్య నిర్వహణతో :

 

- ప్రధాన వీధే కాదు, దాని కుడి - ఎడమల లోపలి బాటలు, కొండొక చోట ఖాళీ స్తలాలు ఇప్పుడు శుభ్రంగా - క్రొత్తగా కనిపిస్తున్నాయి.

 

- నడుమ కొన్ని ఛలోక్తులు, స్వచ్చ కబుర్లు తప్ప కర్తవ్య పరాయణంగా సాగిన సమిష్టి కృషిలో – మళ్ళీ ఎవరి పని విభాగం వాళ్ళదే! ఊడ్చే మహిళలు చీపుళ్లతో బాటలు, వాటి అంచులు ఊడుస్తూనే ఉన్నారు.

 

-  సదరు నరికిన వ్యర్ధాలతో బాటు ఇతరేతర ప్లాస్టిక్ సంచులు, ఖాళీ సీసాలు, కాగితాలు, ఎండుటాకులు వంటివి దంతెలతో అడ్డ చీపుళ్లతో గుట్టలుగా లాగి ట్రస్టుకు చెందిన ట్రాక్టర్ లోకి ఎక్కించి, చెత్త కేంద్రానికి చేర్చి వచ్చే కార్యకర్తలూ సజావుగా తమ పని చేసుకుపోయారు.

 

స్థానికులు కూడా నేటి కార్యక్రమంలో కొంతమంది కలిశారు.

 

- రోజుటి లాగే – వేసవి ఉక్కపోతలు, చెమటలతో కార్యకర్తల బట్టలు తడవడం, నీళ్లు త్రాగి త్రాగి వాళ్ళు తమ వంట్లో నీటిని సమతులం చేసుకోవడం కూడ జరిగింది!

 

- ఇక ఆఖర్న బృందావనుడందించిన కాఫీ – తేనీటిని కూడా యధావిధిగా సేవించడం లోనూ లోటురాలేదు.

 

          6.15 కు మన స్వచ్చ డాక్టరు గారి సమీక్షా సమావేశంలో నేటి – నిన్నటి కోమలా నగర్ ముఖ్య వీధి కాలుష్య పరిష్కారం పట్ల మెచ్చుకోలు, యధావిధిగా ముగిసింది.

 

          తమ కుమారుడు, మనుమరాలితో సహా నేటి స్వచ్చంద శ్రమదానం చేసిన గోళ్ళ సాంబశివరావు గారు ఒక స్థాయిలో ముమ్మారు ఉచ్చరించిన గ్రామ స్వచ్చ – సుందర సంకల్ప నినాదాలు అక్కడి స్థానికులు కొందరిని మేలుకొలిపి ఉండవచ్చు.

 

          స్వచ్చ కార్యకర్తలు చేయదలుచుకొంటే – ఈ కోమలా నగరంలోనే మరొక వారం రోజులు పని ఉంది గాని, DRK గారు కొందరిని సంప్రదించి - 3 – 4 వారాల క్రిందట శుభ్రం చేసిన – ఇప్పుడు కార్యకర్తల కోసం ఎదురు చూస్తున్న – బందరు దారిలోని కీర్తి ఆసుపత్రి నుండి రేపటి స్వచ్చంద శ్రమదానమని ప్రకటించారు.

 

         గ్రామ చరితను తిరగరాసిన.....                 

ఎందరెందరు కార్యకర్తల – దాతలెందరి త్యాగ మహిమల –

రెండు వేల సుదీర్ఘ దినముల – ఈ మహోన్నత స్వచ్చ గాధల

మహాదర్శం సంభవించెనొ – గ్రామ చరితను తిరగరాసెనొ

వా – రందరికి సుమచందనమ్ములు – స్వచ్చ సంస్కృతి ప్రణామంబులు!

   

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

సోమవారం – 01/06/2020,

చల్లపల్లి.

4.05 ని.కు కోమలా నగర్ లో