2030*వ రోజు....           02-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2030* వ నాటి విశేషాలు.

చెక్కు చెదరని - తీవ్ర గ్రీష్మ తాపానికి బెదరని – నిబద్ధత గల స్వచ్చ సైనికులు నేటి వేకువ కూడ నాల్గు గంటల కన్న ముందే - 6.00 తరువాత కూడ నెరవేర్చిన గ్రామ కర్తవ్య నిర్వహణలో పాల్గొన్నది 33 మంది. వాళ్ల స్వేద పూర్వక శ్రమదానానికి నోచుకొన్న చోటు బందరు జాతీయ రహదారి మీద 6 వ నంబరు పంట కాల్వ వంతెన నుండి భగత్ సింగు గారి దంత వైద్యశాల దాక! కరోనా కల్లోలం వల్ల ఇసుక బళ్లు తగ్గి, చెరకు బళ్లు లేక- వాహన రద్దీ లోపించి, బందరు రహదారి తులనాత్మకంగా చూస్తే- గతం కన్న కొంత కాలుష్యం తగ్గినట్లే ఉంది.

“సమయానికి తగు మాటలాడి...” అని త్యాగరాజు గాబోలు సంగీత కృతి పాడినట్లుగా స్వచ్చ కార్యకర్తలు మరింత మెరుగైన ఈ ప్రధాన రహదారి స్వచ్చ-శుభ్రతల కోసం, తన్మూలంగా తమ తమ ఆత్మానందం కోసం:

1) రంగు రాళ్లను మరొకమారు శుభ్ర పరచి, వాటి అందాన్ని ఇనుమడింపజేశారు. కాలేజీ ఎదుట రెండు చోట్ల ఉన్న వేగ నిరోధకాల దగ్గర పేరుకొన్న దుమ్ము ధూళి చెత్త వదిలించారు.

2) పళ్ల దుకాణాల, చిరుతిళ్ల విక్రయ కేంద్రాల దగ్గరి, టీ కొట్టు ఎదుటి ప్రతి చిన్న కాగితం ముక్కల్ని గూడ ఊడ్చి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల  స్తంభాల నడుమ సైతం శుభ్రం చేశారు.

3) ఇప్పుడు గమనించండి-SRYSP, కళాశాల ప్రధాన ద్వారం దగ్గర గాని, రిజిస్ట్రారు కార్యాలయం ఎదుటి రంగు రాళ్లు గాని, మూల్పూరి పూల తోట పరిసరాలు గాని - మునసబు వీధి ముఖ ద్వారం వంటి వన్నీ ఏకాస్త దుమ్ము-చెత్త-ఉన్నా తొలగిపోయి, మరింత కనువిందు చేయడం లేదా?

ఎక్కడో అమెరికాలో ఉన్న ఉడత్తు నళినీ కుమార్, నాదెళ్ల సురేష్, కర్ణాటకలో కాబోలు ఉన్న వేమూరి అర్జున రావు వంటి వారు ఆరాటంతో 5.30 కే ఫోన్లు చేసి, వాకబు చేసి, వాట్సాప్ వీడియోల్లో ఇక్కడ జరుగుతున్న శ్రమదానాన్ని గమనిస్తున్నారు. ఈ స్వచ్చ – శుభ్ర - సుందరీకరణల ఫలితమనుభవిస్తున్న ఈ గ్రామస్తుల్లో కొందరేమో – ఇవేవీ పట్టక - ముసుగు తన్ని నిద్రిస్తున్నారు! ఇదే కాల వైచిత్రి కాబోలు!

          మన స్వచ్చ కార్యకర్త ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారు ప్రతి నెలా ఇచ్చే 5000/- లను ఈ రోజు కార్యక్రమంలో మనకోసం మనం ట్రస్టుకు అందించారు. వీరికి స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు.

చల్లపల్లి స్వచ్చోద్యమం తొలినాటి కార్యకర్త తూములూరి లక్ష్మణరావు ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ – సుందర- సంకల్ప నినాదాలతోను, దరిమిలా నందేటి శ్రీనివాసుని పద్యాలు - పాటలతోనూ 6.20 కి నేటి మన శ్రమదాన సందడి ముగిసింది. అంతులేని ఈ స్వచ్చోద్యమ కథలో రేపటి అధ్యాయం కూడ - నేటి తరువాయిగా ఈ బందరు జాతీయ రహదారి లోని భగత్ సింగ్ గారి వైద్యశాల దగ్గర ప్రారంభించవలసి ఉన్నది!       

        వ్యక్తి? శక్తి?  శ్రీ శ్రీ ఓ శ్రీ శ్రీ!

వ్యక్తిగ సాధించిన దాంట్లో స్వార్ధముండ వచ్చునేమొ!

సమష్టి లో బలహీనుడు శక్తివంతుడగుట నిజమొ!

“వ్యక్తికి బహువచనమె శక్తి” అని అందుకె శ్రీ శ్రీ చెప్పుట!

ఆ కవితకు అసలర్ధం స్వచ్చ ఉద్యమంబేనట!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

మంగళవారం – 02/06/2020,

చల్లపల్లి.