2035* వ రోజు....           07-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2035* వ నాటి దూరస్థుల ఆగమనం.

ఈ వేకువ 3.56 కే బాలికల హాస్టల్(1 వార్డు) దగ్గర ప్రారంభమయిన శ్రమ బంధుర – సుమ సహృదయ స్వచ్చోద్యమ కారుల గ్రామ మెరుగుదల చర్యలలో పాల్గొన్నది 39 మంది. విజయవాడ నుండి విచ్చేసిన ఇద్దరు- గోపాలం కోమలి- శివన్నారాయణులు కాస్త వెనకాముందుగా వీరితో చేరి హాస్టల్ కు ఉత్తర , దక్షిణ, పడమర ప్రక్క- 3 రోడ్ల మీద జరుగుతున్న- బహుశా ప్రపంచంలో మరెక్కడా జరగని-చూస్తే తప్ప నమ్మలేని చల్లపల్లి స్వచ్చ- శుభ్ర-సుందరీకరణ దృశ్యాలను ఆ సాంతం తిలకించి ఆనందించారు! (వీళ్లిద్దరూ మామూలు వ్యక్తులు కారు-ఉభయ రాష్ట్రాలలో- 40 చోట్ల వైద్య శిబిరాలు నడుపుతూ 60 లక్షల మందికి పైగా అస్వస్తులను ఆదుకొంటున్న బ్రదర్ - మదర్- థెరిస్సాలు!

          నేను 5.00 కు హాస్టల్ దగ్గరకు వెళ్లేటప్పటి కనువిందు దృశ్యాలివి:

- ఒకాయన ఏకంగా చెట్టెక్కి, కరెంటు తీగల్ని అందుకోబోతున్న గానుగ చెట్టు కొమ్మల్ని కత్తిరించి, (విద్యుత్ కార్మికుల నిర్దాక్షిణ్యమైన చేతుల్నుండి) చెట్టును కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.

- 10 మంది కార్యకర్తలు తదేక దీక్షతో రోడ్డు కు దక్షిణ దిశలోని ఖాళీ స్తలంలో ప్రవేశించి, ముళ్ల-పిచ్చి మొక్కల్ని, తీగల్ని నరికి, కంచె కోరడును క్రమబద్ధీకరించి, ఆ జాగా మొత్తాన్ని ఎవరైనా చూడక తప్పనంతగా శుభ్రపరిచారు.

- చేతులు, గూళ్ళు నొప్పి పెట్టేంతగా రెండు రకాల చీపుళ్లతో కొందరు మూడు ప్రక్కల దారిని ఊడ్చారు.

- ఏడెనిమిది మంది వసతి గృహ ఉత్తర- పడమర భాగాల డ్రైనును, వాటి గట్లను నానాజాతి కశ్మలాలను, తడిలోని గడ్డిని తొలగించి, ఆ వ్యర్ధాలను గొర్రులతో లాగి, ఆ పోగుల్ని డిప్పలతో ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి తరలించారు.

- జమ్మిలంకమ్మ గుడి ముందు, ప్రక్కల కొందరు మ్రొక్కుబడిగా కాక, క్షుణ్ణం గా శుభ్రపరిచారు.

           ఎత్తు కొమ్మల మీదికి బారు కర్ర కత్తిని, ముళ్ల కొమ్మల మీదకి మరొక కత్తిని ప్రయోగించి, ఇద్దరు నిపుణులు కొన్ని చెట్లను సుందరీకరించారు.

ఇలా చెప్పుకొంటూ పోతే ఈనాటి స్వచ్చ కథకు అంతే ఉండదు గాని, నేటి ముఖ్య విషయాలు రెంటిని ప్రస్తావిస్తాను.

1) ఉభయ రాష్ట్ర వ్యాప్తంగా 40 వినూత్న వైద్య శిబిర ప్రయోక్త ఐన గోపాలం శివన్నారాయణ గారి చల్లపల్లి స్వచ్చంద శ్రమదాన పునః ప్రవేశం. అసలీ డాక్టరును చూస్తేనే ఇక్కడి స్వచ్చ కార్యకర్తలకు , వైద్య శిబిర నిర్వాహకులకు ఎక్కడ లేని ఉత్సాహం, పునరుత్తేజం పూనుతాయి. అలాంటిది- ఆయన అనర్గళంగా 15 నిముషాల పాటు “ మనిషి- సామాజిక బాధ్యత - మానవతా విలువలు.....” వంటివి ఆచరణ పూర్వకంగా వివరిస్తుంటే ఎలా ఉంటుంది?

2) కర్ణాటకలోని ఉడిపిలో ఉద్యోగిస్తున్న కొల్లిపర అనిల్ కుమార్ స్వగ్రామం చల్లపల్లి వచ్చి, తన తండ్రి రవీంద్ర గారితో సహా స్వచ్చంద శ్రమదానం చేసి,  2035 రోజులకు గుర్తుగా” మనకోసం మనం” ట్రస్టుకు 2035/- విరాళమివ్వడం మరింత విశేషం! అనిల్ కుమారునకు మన ధన్యవాదాలు! 

6.15 కు విజయవాడ వాస్తవ్యురాలు కోమలి ముమ్మారు ప్రకటించిన స్వచ్చ-శుభ్ర-సుందర స్వగ్రామ సంకల్ప నినాదాలతో నేటి మన గ్రామ బాధ్యతలకు స్వస్తి!

రేపటి శేష బాధ్యతల పరిపూర్తి కోసం బైపాస్ రోడ్డు లోని 1 వ వార్డు బాలికల వసతి గృహం దగ్గరే కలుసుకొందాం!   

            ఈ విజయ ప్రస్థానం

స్వచ్చోద్యమ చల్లపల్లి విజయ ప్రస్థానం ఎట్టిది?

సామాజిక ఋణం తీర్చు సాహస సద్భావనతో

గ్రామంలో ప్రవేశించు ఏడు ముఖ్య దారులందు

అందమైన పూదోటలమర్చి నిర్వహించడం!

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త- సభ్యులు

ఆదివారం – 07/06/2020,

చల్లపల్లి.

 

 

3.56 కు బైపాస్ రోడ్డులో బాలికల హాస్టల్ వద్ద
డా.గోపాలం శివన్నారాయణ గారి స్పందన