ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1868* వ నాటి సామాజిక బాధ్యతలు.
ఈ వేకువన కూడ 4.00 నుండి 6.10 నిముషాల దాక చల్లపల్లి ప్రధాన కూడలి నుండి విజయవాడ వైపు, బస్టాండ్ దిశగా జరిగిన ద్విముఖ కర్తవ్య నిర్వహణ లో పాల్గొన్న స్వచ్చంద శ్రామికులు 32 మంది.
ఇందులో కొందరు ముందుగా మూడు రోడ్ల కేంద్రం లోని అన్ని రకాల- కిళ్లీ బడ్డీల, పూల కొట్ల, శీతల పానీయాల షాపుల, చెప్పుల షాపుల, టీ కొట్ల, ఇంకా బస్సు ప్రయాణికుల రకరకాల వ్యర్ధాలను, దుమ్మును, ఇసుకను, వాహనాల రాకపోకల మధ్యనే చీపుళ్లతో ఊడ్చి, గుట్టలు చేసి ట్రస్టుకు సంబంధించిన ట్రాక్టర్ లోకి ఎత్తి చెత్త కేంద్రానికి తరలించారు. ఆ పిదప రెండు బృందాలుగా చీలి కొందరు పెట్రోలు బంకు మీదుగా, బస్టాండ్ చివరి దాకా క్షుణ్ణంగా శుభ్ర పరుస్తూ నేటి తమ స్వచ్చ యాత్రను ముగించారు. మిగిలిన వారు విజయవాడ మార్గం గుండా ఆంధ్రా బాంకు ముందు భోజన, టిఫిన్ షాపుల ముందు పచారీ దుకాణాల ఎదుట ఊడ్చుకుంటూ, శుభ్రపరుస్తూ కోట మలుపు దాటి, శివాలయం దాటి, పంచాయితీ కార్యాలయ వీధి వరకూ సంతృప్తి కరంగా తమ చీపుళ్లకు పని చెప్పి ఆ ప్రధాన వీధిని మెరుగు పరచారు.
ట్రస్టు కార్మికులు యథావిధిగా వేకువ 4.00 గంటలకే బయలుదేరి నీళ్ల టాంకర్ తో రహదారుల వెంట తిరుగుతూ స్వచ్చ సైనికులు నాటి, సంరక్షించి, పెంచుతున్న పది వేల చెట్లకు + 17 వేల పూల మొక్కలకు అవసరమైన చోట నీరందిస్తూ ముందుకు సాగుతున్నారు.
6.20 నిముషాల నుండి కాఫీ, టీ, స్వల్పాహార సేవనానంతర సమీక్షా సమావేశంలో ఈ నాటి స్వచ్చ కృషితో బాటు గత మూడు రోజుల స్వచ్చ సైనికుల విశాఖ యాత్రను కూడ వివరించారు. భోగాది వాసు, డాక్టర్ డి.ఆర్.కె. ప్రసాదు గార్లు కొంత వివరంగానూ, మెండు శ్రీను వంటి ఇతరులు క్లుప్తంగానూ, ఎంతో ఉద్వేగంగా విశాఖ లోని పురస్కార ప్రదాన విశేషాలను, 40 మంది కార్యకర్తల పర్యటనల వినోదాలను వివరించారు. గత మూడు రోజులు మన 40 మంది స్వచ్చ సైనికులు అందుబాటులో లేకున్నా స్వచ్చ చల్లపల్లి సుదీర్ఘ – 1868 రోజుల శ్రమదానం కుంటుపడకుండా నిర్వహించిన 23 మంది కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు.
మోపిదేవిలో ఉద్యోగిస్తున్న ఉపాధ్యాయిని రాయపాటి విజయ రమ గారు స్వచ్చోద్యమ చల్లపల్లి పట్ల తమ నిబద్ధతను చాటి, ముమ్మారు ప్రకటించిన స్వచ్చ శుభ్ర సుందర సంకల్ప నినాదాలతో 6.45 నిముషాలకు నేటి మన గ్రామ బాధ్యతలు ముగిసినవి. రేపటి మన స్వచ్చ కృషిని విజయవాడ మార్గంలో బాలాజీ అపార్ట్మెంట్ల దగ్గర కలుసుకొని నిర్వహిద్దాం.
స్పర్శింపుడు-దర్శింపుడు
సులభసాధ్యమగు స్వర్గం చూడాలనిపించినపుడు-
ఒక మరంద స్వచ్చ భావ వీచిక గమనించునపుడు-
అసాధ్యాన్ని సుసాధ్యముగ అనువదింపదలచినపుడు-
స్పర్శింపుడు- దర్శింపుడు-స్వచ్చ సైన్య సేవలెపుడు!
నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
సోమవారం – 23/12/2019
చల్లపల్లి.