2040* వ రోజు....           12-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2040* నాటి శ్రమానంద లహరి.  

వర్షం ప్రొద్దున్నే పరామర్శించడానికి బయలుదేరిన వేళ- ఈ నాటి చలి వేకువ 4.00-6.00 మధ్య కాలాన శివరామపురం బాటలోని మేకల డొంక వద్ద ఆగి, సదరు గ్రామం దిశగా చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల శుభ్ర-సుందరీకరణ ఉద్యోగం విజయవంతంగా ముగిసింది. శ్రమదాతల సంఖ్య కొంత తగ్గి, 24 కి పరిమితం కావడానికి చిత్తడి వర్షం ఒక కారణం కావచ్చు. 40 రోజులకు పైగా కార్యకర్తల లాలన కోసం- ఈ దారి ఎదురు చూపులు ఫలించాయి!

 

            షరా మామూలుగానే  త్రివిధ-శుభ్ర-సుందరీకరణ, భద్రతా శ్రమదాన చర్యలు నేడు కూడ జరిగినవి.

 

- సుందరీకరణ బృందం తామే గతంలో ఇక్కడ నాటి, పెంచి, పూయించిన గద్దగోరు, రంగు రంగుల బోగన్ విలియా వంటి పూల మొక్కలు చెట్లుగా మారి, టెలిఫోను తీగలతో ఆటలాడుకొంటుండగా- ఆ ముళ్ల తీగల్ని చాలా ఒడుపుగా  ట్రిమ్ చేసి, గుమ్మటాల్లా మార్చేశారు. ఇంకా ఒకటి, రెండు నెలల వ్యవధిలో ఈ గుమ్మటాలు పూర్తిగా విరగబూసినపుడు మనం చూసేందుకు మళ్లీ వద్దాం!

 

- మేకల డొంక వంతెన నుండి ఫర్లాంగు దూరం దాక, ఆ తరువాత కూడ ఈ సీజన్ లో ఉండే సమస్య తాడి కాయలు, మట్టలు రాలి పడటం!  చీపుళ్లు, గొర్రుల వారు ఈ నాటి కత్తిరింపులకు గురైన ముళ్ల కొమ్మలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఎండు పుల్లలు, ఆకులతో బాటు త్వరలో రోడ్డు వార మొలకలెత్త గల తాడి పండ్లను గూడ ఊడ్చి, ఇతర చెత్తలతో బాటు ట్రాక్టర్ లోకి ఎక్కించారు.

 

- మిగిలిన కొందరు కత్తులు ఝళిపించి, పిచ్చి-ముళ్ల మొక్కల్ని నరికారు. ఈ రోజు చెమట చిరాకు లేదుగాని, చినుకుల ఆటంకం వచ్చింది. ఐనా వాళ్లు తమ నిర్ణీత సమయం దాక అనుకొన్నది సాధిస్తూనే కనిపించారు.

          

  మరొక విశేష దృశ్యం ఏమంటే- ఒక నిష్టాగరిష్టుడైన కార్యకర్త ఒక్కొక్క పూల మొక్కనే కుదుళ్లు సరిచేసి, విరబూసుకోబోతున్న కొమ్మల్ని దగ్గరగా చేర్చి, త్రాడుతో ఎంత నాజూకుగా కలిపి కట్టాడంటే- ఒక తల్లో, తండ్రో తమ బిడ్డను తలదువ్వి, ముస్తాబు చేసినంత!

 

అతడెవరో- ఏ మొక్కలకలా ప్రేమగా సంరక్షణ చేశాడో- ఉంటే, వీలైతే-శాస్త్రి గారి వాట్సాప్ ఛాయా చిత్రాలలో వెతికి కనిపెట్టండి!

 

ఇదే చల్లపల్లి స్వచ్చ సుందర సుదీర్ఘ ఉద్యమం ధారావాహికలోని ఈ నాటి నివేదిక!

 

రేపటి ప్రణాళిక: వర్షం ఉంటే గ్రామ 3 రోడ్ల కూడలి, లేకుంటే కళ్లేపల్లి దారిలోని మేకల డొంక సమీపంలో మనమందరం కలియడం.

           

స్వచ్చ-సుందర గ్రామ యజ్ఞం

తమకు మాలిన శ్రమ వినోదం- గ్రామ దార్శనిక ప్రమోదం

సమాజ ఋణమును తీర్చు దిశగా స్వచ్చ సుందర గ్రామ యజ్ఞం

రెండు వేల దినాల తరబడి నిండు మనసుల ధృఢ ప్రయత్నం-

ఆ - అందరికి సుమ చందనమ్ములు-అసంఖ్యాక ప్రణామంబులు!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం – 12/06/2020,

చల్లపల్లి.

4.00 కు మేకల డొంక వద్ద
కార్యకర్తలు నాటిన మొక్కలతో రోడ్డు కు ఇరువైపులా అందంగా ఉన్న మేకల డొంక రోడ్డు
రామ్ కుమార్ మాస్టారు గారి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మూడు సంవత్సరాల క్రితం నాటిన కొబ్బరి మొక్క