వాసన కృష్ణారావు....           12-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -  

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 39

 

నాలాంటి సాదా సీదా వ్యక్తులు కూడ - ఇంత గొప్ప 2040 రోజుల ఉద్యమంలో!

 

            దేశంలో అంతకు ముందు ఇలాంటి పెద్ద ఉద్యమాలెట్లా తెలీదు గాని, ఈ చల్లపల్లిలో మాత్రం 6 ఏళ్ల నాడు చడీ- చప్పుడు లేకుండానే స్వచ్చ ఉద్యమం మొదలైందండి. శంకుస్తాపనలూ, ప్రారంభోత్సవాలూ, పేపర్ల ప్రకటనలూ, తప్పెట్లూ - తాళాలూ – మేళాలూ ఏవీ లేకుండ 15 మంది గుర్తింపు గల పెద్ద తలకాయలు చీపుళ్లేసుకొని 12.11.2014 న వేకువ 4.30 కి రోడ్లు ఊడవడంతో మొదలై - 2040 రోజుల నుండి ఒక్కసారైనా ఆగకుండ నడుస్తూనే ఉంది. పైగా దీని దెబ్బకు కృష్ణాజిల్లా లోనే 15 కు పైగా ఊళ్లలోను, ఇతర చోట్ల ఇంకో 15 ఊళ్లు ఈ ఉద్యమాన్ని పట్టుకొన్నాయి.

 

            మామూలుగా నైతే - రోడ్లు ఊడ్చే - మురుగు కాల్వలు బాగు చేసే - చెత్తనంతా డంపింగు కు చేర్చే - యీ చీదరించుకొనే పనుల్లోకి ఇప్పటి సమాజం పోకడల్ని బట్టి, ఎవరూ రానే రాకూడదు. అసలే మన దేశం ఎంత గొప్పదండి? గాంధీ గార్ని లేపేసి, ఆయన సిద్ధాంతాలంటే మేము పడిచస్తాం - మా కిష్టం అని చెప్పుకొనే మంచి దేశం గదా! మాటల్లో చెప్పేది ఏదీ, చేసి చూపడానికిష్టపడని మనుషుల పెత్తనం సాగే సమాజం గదా - ఇంకో ప్రక్కన ప్రతివాడికీ బోల్డన్ని సమస్యలు చుట్టుముట్టే బ్రతుకులు గదా - మరి అలాంటప్పుడు నిజాయితీ - చిత్త శుద్ధి - నమ్మినదానికి కట్టుబడే అలవాటు - అన్నిటికన్న చీకటితో 4.00 కే మొదలై, ఒళ్ళు వంచి ఊరికోసం పనిచేసే ఈ స్వచ్చ ఉద్యమంలోకి ఇన్ని వందల మంది మన గ్రామస్తులు, అన్ని చోట్లగలిపి వేలల్లో కార్యకర్తలు ఎందుకు తలదూర్చారు, తరలి వచ్చారు అని!

 

            బహుశా ఇందులోని కార్యకర్తలంతా పెద్దగా వ్యక్తిగత ఆశలూ, దురాశాలూ లేనోళ్లై ఉండాలి! ఉన్నంతలో తృప్తి చెందే రకం ఐ ఉండాలి! ఇందులో నీతికి – మాటకీ కట్టుబడే – జనం కోసం ఆలోచించే, పాటుబడే ముఖ్య వ్యక్తుల్ని చూసి, నచ్చి, మరికొందరు కార్యకర్తలు వచ్చి ఉండాలి! అదట్లా ఉంచి, ఈ చల్లపల్లిలో 2040 రోజులుగా – స్వార్ధం లేకుండా – ఊరి మంచి కోసం ఇన్ని రకాల మనుషులు ఒక మంచి ఆశయం పెట్టుకొని, దాన్ని సాధించడం కోసం క్రమశిక్షణతో – పద్దతి ప్రకారం కలిసి మెలిసి ముందుకు సాగడమంటే ఎంత పెద్ద విశేషం? వాళ్ళ కృషితో ఇంత పెద్ద ఊరులో ఇన్ని మంచి మార్పులు రావడం, గ్రామస్తుల ఆలోచనల్లో మార్పు రావడం కూడ చెప్పుకోదగిందే!

 

            స్వచ్చ కార్యక్రమం 300 రోజుల సమయంలో వేములపల్లికి చెందిన నల్లూరి మోహనరావు ప్రోద్భలంతో నేనిందులో కి వచ్చాను. మాది చిట్టూర్పు, చిన్నపాటి కాలుష్యరహిత కౌలు వ్యవసాయం, పాప చదువు కోసం చల్లపల్లిలో ఉంటూ – ట్రాక్టర్ మెకానిక్ షెడ్డుతో ఉంటాను. వాసన కృష్ణారావు ని. చాలా రోజులుగా ఉదయం శ్రమదానంలో నేను, సజ్జా ప్రసాదు గారు ఒక టీముగా పనిచేస్తుంటాం. నాది హైస్కూల్లో సగం చదువు.

 

            వీధుల్లో కాలుష్యం - దుమ్ము పీల్చేసే రోటోవేటర్ ఖరీదులు 50 లక్షలు నుండి - 15 - 5 - 3 లక్షల దాక విజయవాడ వంటి చోట్ల రేట్లుండగా - మా స్వచ్చ చల్లపల్లి ఉద్యమం కోసం నేను నా షెడ్డులోనే కేవలం 47 వేల ఖర్చుతోనే 90% సామర్ధ్యంతో - దాన్ని రూపొందించాను. అసలు చల్లపల్లి స్వచ్చ ఉద్యమం లో నాకు నచ్చందేమీ లేదు. రాష్ట్రాలకు, దేశానికి ఈ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమం తప్ప గత్యంతరం ఏముంటుంది? నా సోదర గ్రామస్తులు, గృహిణులు, పంచాయతీ, రెవెన్యూ, పోలీసు వంటి ఆలోచనాపరులు చప్పున ముందుకు గనుక వస్తే చాలు - సహకరిస్తే చాలు - ఈ గ్రామం దేశానికంతటికీ మోడల్ గా పనికొస్తది. జాతిపిత ఆశయం ఈ 70 ఏళ్ల తరువాతయినా ఫలిస్తది.


- వాసన కృష్ణారావు.

           కోమలా నగర్ – 10.06.2020.