2058* వ రోజు....           30-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ మనం వాడవద్దు.

 

2058* వ నాటి వేకువ ఉత్సాహం!

 

            ఈ రోజు వేకువ సమయాన కూడ అదే వేళకు - 4.02 - 6.05 (నాకు బొత్తిగా నమ్మకం ఉండదు గాని) బహుశా ఈ ముహూర్తం స్వచ్చ సైన్యానికి బాగా “అచ్చి వచ్చి” ఉంటుంది! ఎందుకంటే - వీళ్లు చాలా మార్లు పగలు, సాయంత్రం, రాత్రి వేళల్లో కూడ శ్రమదానాలు చేశారు గాని, 99.9 శాతం రోజులు వీరి శ్రమదాన ప్రారంభం మాత్రం ఒక్కటే - అది పొరుగు గ్రామాలకు వెళ్లి చేసినా సరే! 2058 రోజులు గడిచాక కూడ - “ఇది నిజమేనా - 3.00 కే లేచి, వేకువ 4.00 కాకముందే శ్రమ సమర్పిత ప్రదేశాన్ని చేరుకొని, ఇంత మంది నిస్వార్ధంగానే ఇన్నిన్ని గ్రామ బాధ్యతలు ఇంత ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించారంటారా? వానలో - ఎండలో - తుఫానులో - మంచు, చలి గాలులలో ఏవి వచ్చినా వీళ్ల పని సమయాలు మారవా? ఊరి కోసం వీళ్ల దీక్ష చెక్కు చెదరదా?....“అని ఇలాంటి ధర్మ సందేహాలు - కనీసం ఈ గ్రామ, దీని పరసరాల జనంలో ఉండవుగాక ఉండవు! ఊరి మేలు కోసం చీపురు పట్టిన - మురుగు గుంటల్లో దిగిన కార్యకర్తలు ఏది చేయలేదు గనుక? తమ శ్రమను, సమయాన్నే కాదు - తమ కష్టార్జితాన్ని కూడ అవసరానుగుణంగా స్వచ్చ సైనికులు దానం చేస్తూనే ఉన్నారు!

 

            ఈ జూన్ మాసము చివరి దినాన 26 మంది కార్యకర్తలు ATM కేంద్రం వద్ద వాహనాలు నిలుపుకొని, చీపుళ్లు, గొర్రులు చేతబూని, బందరు రహదారిలో తూర్పు దిశగా సామ్యవాద(కమ్యూనిష్టు) వీధి దాక రెండు గంటల పాటు - దారికి రెండు ప్రక్కల ఊడ్చుకొంటూ - రకరకాల వ్యర్ధాల కాలుష్యాలను జయించారు.

 

            ఆరేడుగురు ఉత్సాహపరులు- నాలుగేళ్ల నాడు దివంగత వాసిరెడ్డి వారు ఒంటి చేత్తో ఒక రూపుకు తెచ్చిన  భారత లక్ష్మి రైస్ మిల్లు వీధి శుభ్రతకు పూనుకొన్నారు. ఆ సిమెంటు మార్గం ఉద్యానంతో, పూల పలకరింపులతో ఇప్పుడు ఆహ్లాదకరంగా ఉన్నది గాని - రోడ్డు అంచులు విరిగే - ఎదురు వచ్చే వాహనదారులు పడిపోయే ప్రమాదాలు పొంచి ఉన్నందున - ఈ కార్యకర్తలు ఆ రోడ్డు సంరక్షణ  కోసం నడుం కట్టారు. ఎవరికి వాళ్లం ఇళ్ళలో కూర్చొని –

 

            “సర్వేజనాః సుఖినోభవంతు” అని మాత్రమే గాక ఇలా చల్లపల్లి స్వచ్చ - శుభ్ర - సౌందర్య - రక్షణల కోసం

 

            “సర్వగ్రామ జనాః శ్రమజీవనోభవంతు” అనేది ముందుగా జపించి, ఆ పిదప “సర్వేజనాః సుఖినోభవంతు” అని ఆలోచించాలి, ఆచరణలో చూపితే - మన ఈ గ్రామం దేశదేశాల ఊళ్ళకు తలమానికమైపోదా?

 

            - సరే, ఇక ఆ ప్రకారం సుమారు ఇరవైమంది కార్యకర్తల చీపుళ్ళు పెద్ద మసీదు నుండి ATM కేంద్రం వరకూ - హోటళ్ళ, సైకిల్ షాపుల, గుడుల, టిఫిను బళ్ళ ప్రాంతాలను శుభ్రం చేసి, 6.00 కు విశ్రమించాయి.

 

            ఇటీవలే తన పుట్టిన నాటి చందా ఇచ్చిన గౌరిశెట్టి (BSNL) నరసింహరావు నేటి తన వివాహ దిన సందర్భంగా 1000/- సమర్పించినందుకు మనకోసం మనం ట్రస్టు ధన్యవాదాలు. (ఎక్కడో కర్నాటకలో ఉంటున్న మన స్వచ్చోద్యమ ప్రారంభదిన సీనియర్ (83) కార్యకర్త యొక్క జన్మదిన సంఘటనను రేపు జరుపుకొందాం.)

 

            రేపటి ప్రధాన వీధి శుభ్రతల తరువాయి కోసం ఇదే ATM కేంద్రం దగ్గరే కలుసుకొందాం!

 

             అదొక శ్రావ్య సత్కధ

స్వచ్చోద్యమ చల్లపల్లి శ్రావ్య సత్కధ క్రమం బెట్టిది?

సామాజిక ఋణం తీర్చు తాత్త్వికతే పునాదిగా –

స్వచ్చ కార్యకర్తల యెడ సర్వత్రా గౌరవంతో –

ఆదరణతో – గ్రామస్తుల అవగాహన పెరగడం!   

                             

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 30/06/2020,

చల్లపల్లి.

గౌరిశెట్టి (BSNL) నరసింహరావు గారి విరాళం
కార్యకర్తలు నాటి పెంచి, పోషించిన మొక్కలతో సుందరంగా ఉన్న బైపాసు రోడ్డు.