స్వచ్చోద్యమ చల్లపల్లిలో – 2077* వ నాడు.
ఈ శనివారం – 2077* వ నాటి శీతల ఉదయాన – వేకువ 4.29 - 6.10 సమయాల నడుమ - ఉపమార్గం (బైపాస్) లో కమ్యూనిస్ట్ వీధి పరిసరాలలో జరిగిన గ్రామ స్వచ్చంద విధులలో పాల్గొన్న వారు 20 మంది. అశోక్ నగర్ దగ్గర నుండి సూరి డాక్టరు వీధి దాక ఈ కొద్ది మంది శ్రమదానంతో బాగానే శుభ్రపడింది.
ముఖ్యంగా – సామ్యవాద వీధి దగ్గరగా – ఉత్తర దిక్కులోని మురుగు కాల్వగట్లు గడ్డి తొలగి, పిచ్చి మొక్కలు పోయి, దారికిరు ప్రక్కల గడ్డి చాల వరకు తీసివేయబడి, ప్లాస్టిక్ సంచులు, ఖాళీ మద్యం సీసాలు అదృశ్యమైపోయి, దుమ్ము, కసవులు లేని 150 గజాల సిమెంటు దారి మరల మరల చూడాలనిపించేట్లుగా ఉన్నది. నేటి వీధి పారిశుధ్య కృషిలో ముగ్గురు మహిళా కార్మికుల నిర్విరామ కృషి అభినందనీయం. ఈ మార్గానికి ఉత్తర దిశలోనే – సబ్బినేని బోస్ గారి నూతన నిర్మాణం సమీపంలో రహదారి వనం లోపలి ప్రదేశాన్ని మరో ముగ్గురు కార్యకర్తలు మరింత సుందరతరం చేశారు. ఇద్దరు కార్యకర్తలు కరెంటు తీగల దాక పెరుగుతున్న చెట్ల కొమ్మల్ని జాగ్రత్తగా వంచి, నరికారు. ఈ ఊడ్చిన, నరికిన వ్యర్ధాలన్నీ ఉదయం 6 గంటల వేళకు ట్రస్టు ట్రాక్టరులోకి నింపబడి, చెత్త కేంద్రానికి తరలిపోయినవి.
జరిగింది గంటన్నర కృషే! చేసింది కూడ గ్రామ జనాభాతో సరి చూసుకొంటే అతికొద్ది మందే! కాని వీళ్ళ ఉన్నతాశయం, పంచిన స్ఫూర్తి మాత్రం తక్కువ కానే కాదు!
6.10 సమయం తరువాత – కాఫీ ఆస్వాదనల – కొద్దిపాటి కబుర్ల అనంతరం సంతృప్తికరమైన తమ నేటి గ్రామ బాధ్యతను, రేపటి నిర్దేశిత ప్రాంతాన్ని గమనించుకొని కార్యకర్తలు గృహోన్ముఖులయ్యారు.
రేపటి తరువాయి గ్రామ కర్తవ్య పరిపూర్తి కోసం ఇదే బైపాస్ మార్గంలోని కమ్యూనిస్ట్ వీధి వద్ద వేకువ 4.30 సమయంలో కలుసుకొందాం!
స్వయం మేలుకొలుపే ఇది – స్వయం ఉద్ధరింపేమరి.
ఎవరెవరికో మేలుకొలుపని – ఎంత మందికొ ఉద్ధరింపని
ఇదె మహోన్నత ఉద్యమం బని – సర్వరోగ నివారణం బని
ఎందుకయ్యా! మిడిసి పడటం? ఇదొక కేవల బాధ్యతేనని
అనుసరింపుము – ఆదరింపుము – స్వచ్చ సైన్యం అడుగుజాడను!
నల్లూరి రామారావు,
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు
28.11.2020.