స్వచ్చ సుందర ఉద్యమ చల్లపల్లిలో 2079* వ నాడు.
డిసెంబరు మాసంలో రెండవ నాటి వేకువ 4.23 నుండి 6.10 నిమిషాల వరకు నిర్విఘ్నంగా జరిగిన ఉషోదయ స్వచ్చ వేడుకలో పాల్గొన్న కార్యకర్తలు 28 మంది; పరిశుభ్ర సుందరీకృత ప్రదేశం బైపాస్ మార్గంలో భారతలక్ష్మీ ధాన్యం మర సమీపస్థం! ఈ 100 నిముషాల గ్రామ స్వస్తతా కృషితో:
- సిమెంటు రహదారి మాత్రమే కాక, దాని ఇరు ప్రక్కల మురుగు కాలువల గట్లు, పచ్చగానే – ఏపుగానే పెరుగుతున్నపటికీ అదుపు తప్పి దారి మీదకో, విద్యుత్ తీగల మీదికో వ్యాపిస్తున్న చెట్ల కొమ్మలు, రహదారి అంచుల మీది పిచ్చి మొక్కలు, దుమ్ము, చెత్త, ప్లాస్టిక్ సంచులు, ఖాళీ సారా సీసాల వంటి వన్నీ తొలగిపోయి, బాగుపడి, బైపాస్ మార్గం మరింత ఆకర్షణీయంగా మారినది.
- అంతకముందే కొంత పని జరిగిన కమ్యూనిస్ట్ వీధి దగ్గర ఈ నాడు కూడ సుందరీకరణ బృందం మరిన్ని మెరుగులు దిద్దింది. “ఇక్కడంతా చాలా శుభ్రంగా, అందంగా ఉన్నదే...” అనిపించే చోటును కూడ ఈ బృందం ఒక స్వచ్చ – సుందర శిల్ప కళాఖండంగా మలచగలదు!
గ్రామంలోని ఏ ప్రధాన వీధిలో గడ్డి గాదం పెరిగినా, చెత్త – దుమ్ము – ధూళి పేరుకుపోయినా, రోడ్ల మీద గుంటలు పడినా, మురుగులు పారక నిలిచినా, చెట్లో పూల మొక్కలో లేక బోసిగా కనిపించినా ... ఈ స్వచ్చ కార్యకర్తలు బొత్తిగా సహించలేరు, భరించలేరు మరి! గ్రామ బాధ్యతలను తలకెత్తుకొన్న ఇందరు కార్యకర్తలున్నంత వరకు చల్లపల్లి స్వచ్చ – శుభ్ర – స్వస్తతల కేమిలోటు? నాలుగేళ్ల క్రిందట ఈ బైపాస్ మార్గం ఎంత అసహ్యంగా, దుర్భరంగా, సిగ్గు చేటుగా ఉండేదో – స్వచ్చ కార్యకర్తల కాయకష్టంతో ఇప్పుడెంత ఆహ్లాదకరంగా ఉన్నదో గుర్తు చేసుకొంటేనే ఈ చల్లపల్లిలో స్వచ్చంద శ్రమదానం విలువ ఏమిటో బోధపడుతుంది.
6.15 సమయంలో కాఫీ – సరదా కబుర్ల వేళకు మరికొందరు పెద్దలు కూడ వచ్చి, కార్యకర్తల కృషిని అభినందించారు. డాక్టర్ డి. ఆర్.కె. గారి మెచ్చుకోలు – సమీక్షల పిదప అందరూ సంతృప్తిగా గృహోన్ముఖులయ్యారు.
ఊరి బాధ్యతా నిర్వహణ కోసం మనం మరొక మారు ఈ బైపాస్ వీధిలోనే – 5.12.20 – శనివారం ఉదయం 4.30 సమయంలో బాలికల ప్రభుత్వ వసతి గృహం దగ్గర కలుసుకోవలసి ఉన్నది.
కార్యకర్తల హృదయభారం
ఆయాచితముగ ఉన్న ఊరికి – అన్ని బాధ్యతలు నెరవేర్చిన
దిష్టిబొమ్మగు చల్లపల్లి కి దివ్య సుందర రూపమిచ్చిన
స్వచ్చ సుందర కార్యకర్తకు ‘కరోనా’ అనుకారణాన – ఉ
షోదయాద్భుత సేవలాగుట ఎంత ఘోరం! హృదయభారం!
నల్లూరి రామారావు,
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు
02.12.2020.