సుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లి లో2081* వ నాడు.
మంచు తక్కువై చలి గాలి ఎక్కువైన ఈ ఆదివారం (6.12.2020) నాటి ఉషోదయానికి పూర్వమే – 4.23 నుండి 6.10 వరకు విజయవంతంగా నెరవేరిన గ్రామ ముఖ్య వీధి పారిశుద్ధ్య బాధ్యతలో పని చేసిన ఔత్సాహిక కార్యకర్తలు 28 మంది. కార్యక్షేత్రం – బందరు జాతీయ రహదారిలోని ఏ.టి.యం. ప్రదేశం. తూర్పున సంత వీధి మొదలు పడమర ఇండియన్ బ్యాంకు దాక ఈ కొద్దిమంది దీక్షాపరుల అభినివేశంతో గంటన్నర సమయంలో నే పరిశుభ్రంగానూ, దర్శనీయంగానూ మారిపోయింది.
కూరకాయ దుకాణాల, వ్యాపారపు తోపుడు బళ్ల, పళ్ల దుకాణాల, చిరు తిళ్ళ విక్రయ కేంద్రాల, మూడు దేవాలయాల, పూల అమ్మకాల, పిండి మరల వల్ల పుట్టుకొచ్చే రకరకాల చెత్తలన్నీ, దుమ్ము-ధూళి అంతా, వానల వల్ల తారు రోడ్డు మీద అంటుకొని ఊడి రాని మట్టి మొత్తం, షరా మామూలుగా రోజు వారీగా దర్శనమిచ్చే ప్లాస్టిక్ సంచులన్నీ, ఖాళీ సారా సీసాల వంటి వ్యర్ధాలు సమస్తం తొలగిపోయి, 250 గజాల ఈ సువిశాల రహదారి చాలా రోజుల తరువాత చేసిన కార్యకర్తల శ్రమదానంతో ఆహ్లాదంగా కనిపిస్తున్న మాట నిజమే! కాని, ఈ రోజు స్వచ్చ సైనికుల గ్రామ బాధ్యతా నిర్వహణ ప్రత్యక్షంగా చూసిన కొద్ది మంది గ్రామస్తుల- లేదా ఈ అయాచిత స్వచ్చ శుభ్రతలను ఏళ్ల తరబడీ అనుభవిస్తున్న- ఈ శుభోదయంలో ఇంకా గాఢ నిద్రా ముద్రితులైన సోదర గ్రామస్తుల స్పందన ఏమిటి?
ఉన్న ఊరి సంక్షేమానికి తమకు తాముగా అంకితులైపోవడాన్ని గాని, చలి గాలి లో కూడా చెమటలు చిందుతూ, చేతులు నొప్పి పెట్టే విధంగా గోకుడు పారలతో రహదార్లను గీకి, తోమి శుభ్రపరచడాన్ని గాని, అన్ని రకాల గ్రామవీధుల కశ్మలాలను ఊడ్చి, ట్రస్టు ట్రాక్టర్ల లో నింపి, చెత్త కేంద్రానికి తరలించడాన్ని గాని- ఒక్క మాటలో తమకోసం కాక- పరుల మేలు కోసం తపిస్తున్న ఈ కార్యకర్తల శ్రమైక జీవన సౌందర్య వైభవాన్ని గాని- ప్రత్యక్షంగా చూసి, అనుభూతి చెందాలనుకొంటే – వేకువ 4.30 కు జరిగే ఈ స్వచ్చోద్యమ సంరంభాన్ని దయచేసి స్వయంగా వచ్చి, చూసి పాల్గొనండి.
6.10 సమయం దాకా జరిగిన నేటి శ్రమదానం కాఫీ- టీ సేవనం తోను, సరదా కబుర్లతోను, డాక్టరు గారి సమీక్ష తోను ముగిసింది.
మన తదుపరి గ్రామ కర్తవ్యం కోసం 9.12.202(బుధవారం) వేకువ 4.30 సమయంలో ఊరి ప్రధాన(3 రోడ్ల) కూడలిలో కలుసుకొందాం!
ఒడలు వంచి – చెమట చింది
ఇవేమైన మంత్ర తంత్ర మహిమలొ కనికట్లో కావు
వెదికెక్కి గర్జించే వినదగు ఒరవడులు కావు
రెండు వేల ఎనుబది పైగా స్వచ్చోద్యమ పని దినాలు
ఒడలు వంచు- చెమట చిందు- కళ్ల ఎదుటి వాస్తవాలు
నల్లూరి రామారావు
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు
06 .12.2020.