చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2082* వ నాడు.
ఈ బుధవారం (09.12.2020) నాటి వేకువ 4.25 సమయంలో - వాట్సాప్ ఛాయా చిత్రం సాక్షిగా 15మందితో ప్రారంభమైన గ్రామ స్వచ్చంద బాధ్యతలు అనతి కాలంలోనే రెట్టింపు సంఖ్యకు చేరి 6.05 దాక కొనసాగినవి. ఆదివారం నాటి నిర్ణయం మేరకు బందరు – విజయవాడ – అవనిగడ్డ దారుల ప్రధాన కూడలి దగ్గర ఆగి, రెండు దారుల్లోని ఇంధన నిలయా (బంకు) ల వరకున్నూ, అటు ఆంధ్రా (యూనియాన్) బ్యాంకు వరకున్నూ అలుపెరుగక శ్రమించిన స్వచ్చ సైనికులకు అభివాదములు!
2082* నాళ్ళుగా ఈ గ్రామ కృషీవలుల నిరాఘాట ప్రయత్నం వెనుక ఏ ప్రలోభమున్నది? ఎవరి బలవంతమున్నది? సమాజ పరమైన ఒక ఉదాత్త స్వయం నిర్ణయం తప్ప ఏ సొంత ప్రయోజనమూ లేక సాగుతున్న నిజమైన నిస్వార్ధతే కదా ఈ స్వచ్చోద్యమ చోదక శక్తి! నేటి వాట్సాప్ చిత్రాలను గమనిస్తే – ఇందులో ఉన్నత విద్యాధికులు, రైతులు, మెకానిక్ లు, గౌరవ ప్రద వృత్తి నిపుణులు, విశ్రాంత వయోవృద్ధులు చీపుళ్ళతో దుమ్మును పోగు చేస్తూ, పారలతో మట్టిని వ్యర్ధాలను ట్రక్కులోనికి నింపుతూ, ఆ నింపిన మట్టిని ముగ్గురు యోధులు కిలోమీటరు దూరంలోని వడ్లమర దగ్గరి రహదారి గుంటలలో సర్దుతూ, మహిళలు సైతం పెట్రోలు బంకులు ప్రక్కన డ్రైనులోని కంపు గొట్టే మురుగు కడ్డం పడుతున్న నానారకాల వ్యర్ధాలను బైటకులాగుతూ, మరికొందరు పండ్ల, పూల కొట్ల దగ్గరి అన్ని రకాల తుక్కుల్ని ఊడ్చి ట్రస్టు యొక్క ట్రక్కులోనికెత్తుతూ – ఇంత దీక్షగా, కర్తవ్యనిష్టగా గంటన్నర పాటు శ్రమించడం దేన్ని సూచిస్తున్నది? మిగిలిన సోదర గ్రామస్తులమైన మనందరికి ఏమి స్ఫురిస్తున్నది?
ప్రస్తుతం ఏలూరు పట్టణంలో వందలాది మంది అక్కడి వివిధ కాలుష్యాల కారణంగా అంతుపట్టని కొత్త వింత జబ్బులతో అస్తవ్యస్తులైపోవడం చూస్తే మనం తక్షణం జాగ్రత్త పడదగిన సందేశాన్ని అందించే ఈ స్వచ్చకార్యకర్తలే తప్పక అనుసరణీయులు కాదా? పర్యావరణం వరుసగా ఇన్ని తీవ్ర హెచ్చరికలు చేస్తున్నా ప్రభుత్వాలు, బాధ్యులు, ప్రజలు ఇప్పటికైనా పట్టించుకోకపోతే – ఇక అంతే సంగతి!
నిర్విరామంగా, నిరపేక్షంగా సాగిన నేటి గ్రామ పారిశుధ్య కృషి 6.10 సమయంలో సరదా కబుర్లతోను, కాఫీ కషాయ సేవనంతోను, వెరసి కార్యకర్తల ఆత్మసంతృప్తి తోను ముగిసింది.
తదుపరి సామాజిక బాధ్యతల కోసం వచ్చే శనివారం (12.12.2020) నాటి వేకువ 4.30 సమయంలో గ్రామ ప్రధాన – 3 రోడ్ల కూడలి దగ్గరే కలుసుకొందాం!
శిరసాభివందన చందనాదులు.
పరుల మెప్పుకు ప్రాకులాడక – ఆత్మ తృప్తి పధాన నడచిన
విశాల జనహిత ఆశయంతో విక్రమించిన – వినుతికెక్కిన
రెండు వేల దినాల శ్రమతో ప్రయాణించిన – జయం పొందిన
అందరికి శిరసాభివందన లలౌకిక సుమచందనాదులు!
నల్లూరి రామారావు
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు
09.12.2020.