స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2085* వ నాటి సేవావినోదం!
యధావిధిగా ఈ బుధవారం (16.12.2020) నాటి ఉషోదయారంభంలో – 4.20 నుండి 6.05 వరకు చల్లపల్లి స్వచ్చోద్యమ కారుల, ఉద్యమ కారిణుల స్వగ్రామ బాధ్యతలు నిరాఘాటంగా జరిగిపోయినవి. నేటి సేవల రంగస్థలం – ఊరి 3 రోడ్ల ప్రధాన కూడలి మొదలు అవనిగడ్డ దిశగా ప్రభుత్వ రవాణా బస్సు కేంద్రం దాక! ఐచ్ఛికంగా, అనివార్యంగా పాల్గొన్న స్వచ్చ సైనికులు 25 మంది.
గతంతో పోల్చుకొంటే సహజంగానే - స్వచ్చందంగానే మెరుగైన స్వచ్చ శుభ్రతలు సంతరించుకొన్న ఈ అరకిలోమీటరు జాతీయ రహదారి ఎడతెగని వర్షాలతో, పెరుగుతున్న వాహనాల రాకపోకలతో కాస్త మసక బారింది. ఇప్పుడు మళ్ళీ నేటి శుభ్ర – సుందరీకరణతో సూర్యోదయానంతర వెలుగు రేకలతో అది తళతళలాడుతున్నది. ఇటు కార్యకర్తలకు కూడ కావలసినంత ఆత్మతృప్తి!
సుమారు 7 ఏళ్ల నాడు – జనవిజ్ఞానవేదిక కార్యకర్తలు వీధి పారిశుద్ధ్యాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళను తేడాగా చూసినట్లుగా గ్రామస్తులిప్పుడు వింతగా చూడకపోగా, గౌరవంగా చూస్తుండడం ఒక సానుకూల పరిణామం. ఊరి భవితకు అంకితులైపోయిన కార్యకర్తల నేటి కృషితో వందలాది దుకాణాల ముందర దారి మీద ఏ చిన్న కాగితం ముక్కయినా మిగలక, ప్లాస్టిక్ సంచులు, కప్పులు, దుమ్ము, ఇతర చెత్తలన్నీ తొలగిపోయి, స్వచ్చత మాత్రమే మిగిలిపోయి, అద్దంలా కనిపిస్తున్న యీ రద్దీ ప్రాంతాన్ని గ్రామస్తులు బాగా గమనిస్తేబాగుంటుంది. చల్లపల్లి ఇపుడొక అరుదైన ప్రత్యేక గ్రామమనీ, ఆ స్వచ్చ – సౌందర్యాలు కలకాలం మనం నిలుపుకోవాలనీ ఈ 30 వేల సోదర గ్రామస్తుల మనసుల్లో గాఢంగా నాటుకొని స్వచ్చ కార్యకర్తల చిరకాల స్వప్నాలు ఋజవైపోవడం కన్న కావలసినదేముంటుంది?
ఈ స్వచ్చ యాజ్ఞికులు నేటి తమ సామాజిక బాధ్యతను ముగించి కాఫీ - టీ లను ఆస్వాదించి, పరస్పర కుశలాలను ప్రస్తావించి, తమ తదుపరి ప్రణాళికను చర్చించి, 6.25 సమయంలో గృహోన్ముఖులయ్యారు. వచ్చే ఆదివారం – అనగా డిసెంబరు 20 నాటికి చల్లపల్లి స్వచ్చోద్యమ ఆరంభానికి 7 ఏళ్లవుతుంది.
మనతదుపరి సామాజిక విధుల కోసం 19, 20 తేదీలలో (శని, ఆదివారాలు) వేకువన కలువవలసిన కార్యక్షేత్రం చిల్లలవాగు దగ్గరి చల్లపల్లి ప్రధాన శ్మశాన వాటిక. అప్పటికి మరింత మందిమి ఆ రుద్రభూమి శుభ్రతకై శ్రమించవలసి ఉన్నది.
కాలం చెల్లని వాదం.
అద్భుతాల స్వచ్చోద్యమ మారాధ్యం కాకుంటే –
ఆరేళ్ళ సుదీర్ఘ శ్రమ కభినందన లేకుంటే –
గాంధీ ఆదర్శానికి కాలం చెల్లి నట్లే గద!
శ్రమ జీవన సౌందర్యం చతికిల బడినట్లే గద!
నల్లూరి రామారావు
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు
16.12.2020.